మహాశివరాత్రి పర్వదినాన అందరూ భక్తిపారవశ్యంలో ఉంటే.. ఆలయంలో దేవుడ్ని దర్శించుకోవడానికి వచ్చిన ఓ వీఐపీ మాత్రం అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై బూతు పురాణం అందుకున్నాడు. దీంతో శివ..శివా… పండుగ పూట గుడిలో ఇదేంటని.. భక్తులు మండిపడ్డారు.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శ్రీభ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ గుడిలో దైవదర్శనానికి జడ్పీ ఛైర్మన్ ప్రభాకర్ వెళ్లారు. అయితే ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉడడంతో భక్తుల మధ్య నుంచి వీవీఐపీ వరుసలో ఆయన వెళ్తున్న క్రమంలో కాస్త తోపులాట జరిగింది.
దీంతో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది పట్ల జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో కాసేపు అక్కడ వైస్ ఛైర్మన్, పోలీసు కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను జడ్పీ వైస్ ఛైర్మన్ కుంచాల ప్రభాకర్ అసభ్య పదజాలంలో దూషించడంతో భక్తులు షాక్ అయ్యారు.
అయితే కానిస్టేబుల్ కూడా ప్రభాకర్ పై గరం కావడంతో కాసేపు అంతా గందరగోళం నెలకొంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని అసహనానికి గురయ్యారు. పండుగ పూట గుడిలో ఇదంతా ఏంటని మండిపడ్డారు.