ఏపీలో సంక్రాంతి సందడి జోరుమీదుంది. సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలందరూ ఆంధ్రాకు చేరుకొని కోడి పందాలను ఎంజాయ్ చేస్తుండడంతో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు కోడిపందాలు ప్రారంభమయ్యాయి.
కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో రెండు నుంచి మూడు కోడి పందాల బరులు ఏర్పాటు చేసి జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. బరుల వద్దకు భారీగా పందెంరాయళ్లు తరలివస్తున్నారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో గుండాటలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ పై నిషేధం కొనసాగుతుంది. ఇక రెండవ రోజు కోడి పందాల హోరుతో సంక్రాంతి పండుగ శోభ రెట్టింపు అయింది.
కోడి పందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కాకినాడ రూరల్ లో కోడి పందాల నిర్వాహకులు ఆకర్షణీయమైన బహుమతులు అందచేస్తున్నారు. వందల బరుల్లో కోడిపందాలు సాగుతున్నాయి. పందాల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులు బహుమతులుగా అందచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కోడిపందాలను ఇజ్జత్ కా సవాల్ గా భావిస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల జోరు కొనసాగుతోంది.
పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బరుల్లో పందెం పుంజులు నువ్వా నేనా అంటూ పోరాడుతున్నాయి. కోడి పందాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దెందులూరులో కోడి పందాల జోరు హోరెత్తింది. పందెం బరుల బయట పేకాట, గుండాట ఇతర ఆటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ ఆటల్లో పాల్గొంటున్నారు. ప్రతి గుండాట దగ్గర లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.