ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండవ రోజు బిజీ బిజీగా గడిపారు. క్షణం తీరిక లేకుండా పర్యటించారు. ఉదయం 10 గంటలకు పలువురు మీడియా ప్రతినిధులతో తాజ్ కృష్ణ హోటల్ లో సమావేశమైన రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం చేయడాని కావలిసి సలహాలు,సూచనలు స్వీకరించారు
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు.. ప్రజా గాయకుడు గద్దర్, హరగోపాల్, కంచె ఐలయ్య లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించకపోవడానికి గల కారణాలను రాహుల్ అడిగినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత హోటల్ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. పార్కులో ఏర్పాటు చేసిన శిభిరంలో కాంగ్రెస్ నేతలతో కాసేపు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కలిసేందుకు కాంగ్రెస్ శ్రేణులు పార్కు వద్దకు భారీగా చేరుకున్నాయి. పార్కులోకి వెళ్లేందుకు కార్యక్రర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం చంచల్ గూడ జైలుకు వెళ్లిన రాహుల్.. రిమాండ్ లో ఉన్న ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ తో పాటు.. మరికొందరు కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు. తమకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటోందని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు రాహుల్. అధైర్యపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. రాహుల్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ములాఖాత్ లో పాల్గొన్నారు.
ఆ తర్వాత హైదరాబాద్ లుంబినీ పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపాన్ని పరిశీలించారు రాహుల్. అమరవీరుల స్థూపం పనుల గురించి మాణిక్యం ఠాకూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నాయకులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని రాహుల్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించడంతో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. అమరుల త్యాగాలను గౌరవించుకోలేని దుస్థితి తెలంగాణలో దాపురించిందని విరుచుకుపడ్డారు రాహుల్.