ప్రేయసి కోసం వెంటపడి తన ప్రేమను గెలుచుకునేందుకు ప్రియుడు చేసే తిక్క వేశాలను సినిమాల్లో చూస్తాం. అవి చూసి కోపం వచ్చిన ప్రేయసి అతన్ని తిట్టడం, కోపంతో చెంపదెబ్బ కొట్టడం వంటి సీన్స్ చూస్తుంటాం. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ప్రియుడు క్షమించమని నేరుగా అడగకుండా ప్రేయసికి లేఖలు రాయడం.. లేదంటే ‘Sorry’ అని రాసి పుస్తకాల్లో పెట్టి ప్రాధేయపడటం చేస్తుంటారు.
మరి ఇలాంటి సినిమాలు చూసి స్పూర్తి పొందాడో..? ఏమో తెలియదు కానీ.. బెంగళూరులో ఓ ఆకతాయి సరిగ్గా ఇదే పని చేశాడు. బెంగళూరులోని సుంకదకట్టె ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ కళాశాల గోడలు, మెట్లతో పాటు.. ఆ చుట్టూ ఉన్న వీధుల్లో సారీ.. సారీ.. అనే పెయింటింగ్‌లతో నింపేశారు. తెల్లవారుజామున చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కళాశాలకు చేరుకున్న పోలీసులు ఇది చూసి అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. ఆకతాయిలు చేసిన పని అంతా సీసీటీవీలో రికార్డైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు గుర్తించామని తెలిపారు.
అందుకు సంబంధిచిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు.. అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయి కోసమే యువకులు ఇలా చేసి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. అయితే.. పోలీసులకు మాత్రం వారిని గుర్తించడం తలనొప్పిగా మారింది.