తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా తాజా నోటీసుల్లో సీబీఐ ఆదేశించింది. అవినాష్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా జగన్ ఇంట్లో పనిచేసే నవీన్, సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిలనూ సీబీఐ విచారించింది.
మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప లేదా హైదరాబాద్ ఎక్కడికి వస్తారో చెప్పాలని నోటీసుల్లో సూచించింది సీబీఐ.
కాగా ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గత నెలలో సీబీఐ ముందు హాజరయ్యారు. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా సీబీఐ ఆరా తీస్తోంది. హైదరాబాద్ కేంద్రీయ సదన్ లో ఉన్న సీబీఐ ఆఫీసులో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం ఆయనను విచారించి కీలక విషయాలు సేకరించారు.
మొదట విచారణకు సహకరిస్తానని అవినాష్ రెడ్డి తెలిపారు. కానీ తన న్యాయవాది సమక్షంలోనే విచరాణ జరగాలని ఆయన కోరగా సీబీఐ అందుకు నిరాకరించింది. దీంతో అవినాష్ రెడ్డి మాత్రమే సీబీఐ విచారణకు హాజరయ్యారు.