జనగామలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. పీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు దాన్ని అడ్డుకునేందుకు చూశారు. దీంతో రెచ్చిపోయిన గులాబీ శ్రేణులు కర్రలతో దాడులకు తెగబడ్డారు.
తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చేరారు కొందరు బీజేపీ కార్యకర్తలు. అయితే.. గురువారం నర్మెట్టలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇటు జనగామలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దాడికి యత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తోపులాట జరగ్గా.. జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు.
Advertisements
మరోవైపు శుక్రవారం జనగామ పర్యటనకు వెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఇదే సమయంలో ఘర్షణలు జరుగుతుండడంతో పోలీసులు బందోబస్తు పెంచారు. ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. గృహనిర్బంధం చేస్తున్నారు.