హైదరాబాద్ లో మరోసారి ఐటీ రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాలానగర్ లోని ఓ రసాయన పరిశ్రమ, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు చేశారు. వారం రోజుల కిందట హైదరాబాద్ లోని పలు చోట్లు ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. 20 బృందాలుగా ఏర్పడిన 60 మంది అధికారులు.. ఏకకాలంలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ లోని ఎక్సెల్ గ్రూప్ తో పాటు అనుబంధ సంస్థల్లో రెయిడ్స్ చేశారు. గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్ ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఎక్సెల్ గ్రూపు నడుపుతోంది.
అలాగే బాచుపల్లి, చందానగర్, కోకాపేట, బాబుఖాన్ లేక ఫ్రంట్ విల్లాస్ లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు తనిఖీలు జరపడం చర్చనీయాంశంగా మారింది.
డిసెంబర్ లో స్థిరాస్థి వ్యాపారి వంశీరామ్ బిల్డర్స్ పై రెండు రోజులుగా కొనసాగిన ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేశారు. హైదరాబాద్, విజయవాడల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మెయిన్ ఆఫీసుతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, కంప్యూటర్లు, సీపీయూలు స్వాధీనం చేసుకుని, వాటిని ఐటీ ఆఫీసుకి తరలించారు.