పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య క్యాబినెట్ మీటింగ్ నిర్ణయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇప్పుడు కూడా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతుండడంతో..కొత్త స్కీములతో మాయ చేసే ప్రయత్నం జరుగుతోందని పొన్నాల ఫైర్ అయ్యారు.
దళిత బంధు ,డబుల్ బెడ్ రూమ్, గొర్రెల లోన్స్ ,పోడు భూముల జీవో 58 ,59 ల పై కొత్త పథకాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేర్లు చెబితే మళ్లీ ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో సనాతన ధర్మాలకు సంబంధించిన మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. మరొకసారి కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నాలుగున్నర నెలల్లో 33 వేల కోట్లు పథకాల కోసం ఎలా ఖర్చు పెడతారో తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకొని ఇన్ని ఏళ్లు అవుతున్నా.. అక్కడ ఇప్పటి వరకు దళిత బంధు స్కీం ఎందుకు ప్రారంభించలేదని ఆయన నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్స్ అప్లికేషన్లు 30 లక్షలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 50% గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం.. ఈ నాలుగున్నర నెలల్లో మాత్రం 50% ఇస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో మూడు లక్షల అరవై వేల కుటుంబాలకు గొర్రె పిల్లలు ఇవ్వడానికి దొరుకుతాయా అని పొన్నాల నిలదీశారు.
ఇక మునుగోడు ఎన్నికల్లో గొర్రెలు దొరకడం లేదని 55 వేల రూపాయల చెక్కులు ఇచ్చి.. ఎన్నికలు కాగానే ఆ చెక్కులను రద్దు చేశారా లేదా చెప్పండని ఆయన కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. అదే విధంగా ఎనిమిదేళ్ల పాటు ఏం చేయలేని కేసీఆర్ ఇప్పుడు నాలుగు లక్షల 900 మందికి.. లక్ష యాభై వేల ఎకరాల పోడు భూములు ఇస్తానని చెప్పడం మోసమని చెప్పారు. ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ కు బుద్ధి చెప్తారని అన్నారు పొన్నాల.