హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సోమవారం నగరంలో బీఆర్ఎస్ నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని కొంతమంది మహిళా నేతలు మేయర్ విజయలక్షి సమక్షంలోనే వాదనకు దిగారు. అందరికీ గౌరవం దక్కాలని కానీ అలా జరగడం లేదని మహిళా నేతలు మండిపడ్డారు. అధికార పార్టీ మహిళా నేతల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా అయింది.
అనంతరం ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. అంబర్ పేట్ లోని కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ ఘటనపై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎవరికో కుక్క కరిస్తే.. ఆ కుక్కలను కరవమని చెప్పినట్టు తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్ మేయర్ గా పని చేయడం అంత సులువైన పని కాదన్నారు. ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారని, బీఆర్ఎస్ లో మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్నారు.
అయితే గతేడాది ఉప్పల్ నియోజక వర్గంలో మేయర్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మహిళా దినోత్సవం సందర్భంగా మేయర్ సమక్షంలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి రావడం గులాబి పార్టీలో చర్చగా మారింది.