తెలంగాణ సర్కార్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనంలో ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లు గడిచిన ధరణి సమస్యలు ఎందుకు ఇంకా పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడొస్తాయో చెప్పగలరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటాయింపులు లేకున్నా బడ్జెట్ మాత్రం వినసొంపుగా ఉందన్నారు. కరెంట్ కోతలపై నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా బీఆర్ఎస్ నుంచి తన అనుచరులను సస్పెండ్ చేయడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు.
మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించారని, వాళ్ల గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని అంటున్నారని.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన బొమ్మ ఎందుకు వేశారని ప్రశ్నించారు.