మోడీ సర్కార్ తో పాటు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మొదలైన వాల్ పోస్టర్స్, ఫ్లెక్సీ వార్ పీక్స్ కు చేరుకుంది. తాజాగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అర్థం వచ్చేలా ఉంది.
దేశంలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులంటూ.. ఆనాడు స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీష్ పాలకులు అణచివేసినట్లు ఈ నాడు ప్రతిపక్షాలను బీజేపీ పాలకులు అణగదొక్కతున్నారని పోస్టర్లలో పేర్కొనడం జరిగింది. దీని కోసం బ్రిటిష్ జెండాతో మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల ముఖాన్ని కప్పడం జరిగింది.
అదే విధంగా.. గతంలో బ్రిటిష్ పాలన లాగే ప్రస్తుతం బిజెపి పాలన అంటూ .. కాషాయ రంగు ఉన్న చెయ్యి అపోజిషన్ పార్టీల నేతల నోటికి అడ్డంగా పెట్టినట్టు పోస్టర్లు వెలిశాయి. దీంతో పాటు ఆ పోస్టర్లలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది మహాత్మ కాపాడు..” అని.. బై బై మోడీ అంటూ చివర్లో ఉంది.
ఇక ఇలా ఉంటే..బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీఎల్ సంతోష్ కనబడుట లేదు అంటూ ఫోటోలు హైదరాబాద్ నగరం నిండా వెలిశాయి. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్దహస్తుడని.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. పట్టిచ్చిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు.. బహుమానం అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. దీంతో బీఎల్ సంతోష్ పోస్టర్లను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సూత్రధారి ఈయనేనని టాక్ మళ్లీ మొదలైంది. ఇక ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేశారని కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే నగర వ్యాప్తంగా అంటించిన ఈ పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.