ఉత్తర ప్రదేశ్ అంటే ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్లకు అడ్గాగా ఉండేదని ప్రధాని మోడీ అన్నారు. గతంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రం ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 9,055 మందికి పైగా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్లు, ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ (పీఏసీ) ప్లాటూన్ కమాండర్లు, అగ్నిమాపక సిబ్బందికి అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగించారు.
ప్రతీ వారం రోజ్‌గార్ మేళాలో పాల్గొని ప్రసంగించే అవకాశం తనకు లభిస్తోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో కొత్త ఆలోచనలు, సామర్థ్యాన్ని తీసుకువచ్చే అనేక మంది ప్రతిభావంతులైన యువకులను దేశం నిరంతరం పొందుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.
యూపీ రోజ్ గార్ మేళా గురించి ఆయన మాట్లాడుతూ… ఇది తొమ్మిది వేల కుటుంబాలకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. దీంతో పాటు యూపీలో భద్రతా భావాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. కొత్త రిక్రూట్‌మెంట్‌లు రాష్ట్రంలో పోలీసు బలగాలను బలోపేతం చేస్తాయన్నారు.
ఒకప్పుడు యూపీ అంటే మాఫియా, శాంతి భద్రతల వైఫల్యం గుర్తుకు వచ్చేవన్నారు. కానీ యూపీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్, డెవలప్‌మెంట్ ఓరియంటేషన్‌తో గుర్తింపు పొందిందన్నారు. దీంతో ఇప్పుడు ఉపాధి, వ్యాపారం, పెట్టుబడులు వంటి కొత్త అవకాశాలకు దారితీసిందని చెప్పారు.