భౌతిక దూరం తప్పనిసరి అని ఎందుకు చెబుతున్నారో ఈ వార్తను బట్టి చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివాసముండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బర్త్ డే కారణంగా తన ఆపార్ట్మెంట్ లో ఏకంగా 23మందికి కరోనా పాజిటివ్ రావటం స్థానికంగా సంచలనం రేపుతోంది.
మాదన్న పేటలో గల అపార్ట్మెంట్ లో మొదట ఆరుగురికి ఒకే కుటుంబంలో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 63 సంవత్సరాల వృద్దుడు ఆయన భార్య, కొడుకు, కోడలితో పాటు వారి ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరి ఇంట్లో పనిచేసే మహిళకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఈ నెల 10న అదే అపార్ట్మెంట్ లో మరొకరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ అపార్ట్మెంట్ వాసులకు పరీక్షలు చేయగా… మొత్తం 23మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో ఐదుగురి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
వీరంతా బర్త్ డే పార్టీ సందర్భంగా కలుసుకోవటం, భౌతిక దూరం పాటించని కారణంగా వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ ఏరియాను కంటైన్మెంట్ క్లస్టర్ గా మార్చిన అధికారులు, లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.