మార్కెట్లోకి వచ్చిన సరికొత్త వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రిజిష్ట్రేషన్ నంబర్ గా ఫ్యాన్సీ నంబర్ని దక్కించుకో వాలనుకునే వాళ్ళు అంతకు రెట్టింపు ఉన్నారు.ఇందులో కేటగిరీలు కూడా ఉన్నాయి. లక్కీ నంబర్ పిచ్చోళ్ళు, నాలుగు అంకెలు ఒకే నంబర్ కావాలనుకునే వాళ్ళు. డబుల్ నంబర్ ఇంట్రస్టు ఉన్నవాళ్ళు అబ్బో ..! ఈ నంబర్ల చుట్టూ చాలా పెద్ద స్టోరీ నడుస్తూ ఉంటుంది. అంతకు మించి బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది.
రవాణా శాఖ వీఐపీ నంబర్లంటూ అనేక సంఖ్యల సీరీస్లను అమ్మకానికి ఉంచుతుంది. వీటినే ఫ్యాన్సీ, వీఐపీ, వీవీఐపీ నంబర్లు అంటారు. వీటిపై ఆసక్తి ఉన్నవారు అధికారులు నిర్దేశించిన రుసుమును చెల్లించి మనకు నచ్చిన నంబర్ను పొందవచ్చు.
కానీ, కొన్ని సందర్భాలలో ఒకే సంఖ్య కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. అటువంటి సమయాల్లో ఆఫీసర్లు బిడ్డింగ్(వేలం) ప్రక్రియను చేపడతారు. ఇందులో పాల్గొన్న వారు ఎంత ఖర్చు చేసైనా సరే చివరకు వారికి నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ను దక్కించుకుంటారు.ఇది రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
ఈ తరహాలో హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో ఓ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సంఖ్య అక్షరాల కోటి రూపాయలకు పైగా పలికింది.తాను కొత్తగా కొన్న స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ సంఖ్యను దక్కించుకునేందుకు భారీ మొత్తంలో రవాణా శాఖకు సమర్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. హిమాచల్ ప్రదేశ్ శిమ్లాకు చెందిన ఓ వాహనదారుడు. మరో 26 మంది సైతం ఆ సంఖ్యను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. శిమ్లా కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేలంలో అత్యధిక ధరకు బిడ్ వేశాడు.
కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ ఔత్సాహికుడు HP999999 ఫ్యాన్సీ నంబర్కు ఏకంగా రూ.కోటి 11 వేలు బిడ్డింగ్ వేశాడు. వీవీఐపీ(HP999999)నంబర్ కోసం 26 మంది ఆసక్తి చూపి వేలంలో పాల్గొన్నారు. అయితే ఏకంగా రూ.కోటి 11 వేలకు దీనిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు ఓ వ్యక్తి.
వాస్తవానికి దీని రిజర్వ్ ధర రూ.1000గా ఫిక్స్ చేశారు అధికారులు.ఫ్యాన్సీ నంబర్లను అధిక ధర కోట్ చేసిన వ్యక్తులకు కేటాయించనున్నారు. ఈ వీఐపీ నంబర్ల జాబితాలో ఇంకా చాలా సంఖ్యలు ఉన్నాయి. HP990009 (రూ.21లక్షలు), HP990005(రూ.20లక్షలు), HP990003(రూ.10 లక్షలు) వంటి నంబర్లు వేలంలో ఉన్నా..అందరి దృష్టి మాత్రం HP999999 సంఖ్య మీదే పడింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నంబర్ను దక్కించుకున్న వ్యక్తి రూ.లక్ష పెట్టి స్కూటీని కొనుగోలు చేస్తే.. దాని రిజిస్ట్రేషన్ నంబర్ కోసం మాత్రం ఏకంగా రూ.కోటికి పైనే బిడ్డింగ్ చేయడం.
సాధారణంగా రూ.కోట్లు విలువ చేసే కార్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను పొందుతారు కొందరు. కానీ, స్కూటీ కోసం ఇంత మొత్తంలో బిడ్డింగ్ వేయడాన్ని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.
ఇక గతేడాది ఏప్రిల్లో హరియాణా ఛండీగఢ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే తరహాలో భారీ మొత్తాన్ని చెల్లించి తన స్కూటీ నంబర్ ప్లేట్ కోసం లక్షల సొమ్మును సమర్పించుకున్నాడు. రూ.71,000 విలువ గల ఓ రిజిస్ట్రేషన్ నంబర్ను ఏకంగా రూ.15.44 లక్షలు చెల్లించి కోరుకున్న సంఖ్యను సొంతం చేసుకున్నాడు.