– భూముల క్రమబద్దీకరణలో ఇష్టారాజ్యం
– దోచిపెడుతున్న అధికార ముఠా
– యూఎల్సీ మిగులు భూముల్లో లక్ష కోట్ల దందా
– ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే భారీ స్కాం
– తొలివెలుగు క్రైం బ్యూరో చేతిలో ఆక్రమార్కుల చిట్టా?
– అంతా తానై నడిపిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్
– జీవోలో చెప్పిందేంటి.. చేస్తోందేంటి?
– కళ్లు మూసుకుంటున్న కలెక్టర్లు, ఆర్డీఓలు
– తొలివెలుగులో ఇకపై వరస కథనాలు
క్రైం బ్యూరో, తొలివెలుగు:ఎన్నికల్లో వంద ఖర్చు పెడితే వెయ్యి సంపాదించాలనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. చాలామంది ప్రజలకు సేవ చేయాలనే అర్థాన్ని మార్చేసి.. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్నే మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమాదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులదీ ఇదే తీరనే వాదన ఉంది. చాలామంది రాజకీయ నేతలను వాడుకుంటూ.. క్విడ్ ప్రోకో కింద సహకరించుకుంటున్నారు. తెలంగాణలో భూముల రేట్లు ఎంత ఎక్కువో.. లిటిగేషన్లు కూడా అంతే. ఇక్కడ నడిచే రియల్ దందా మామూలుగా ఉండదు. అన్ని రంగాలకు చెందినవారు ఈ రియల్ ఎస్టేట్ లో చక్రం తిప్పుతున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో. ఈ క్రమంలోనే అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి చివరి 15 రోజుల్లో 500 యూఎల్సీ పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి భారీగా లబ్ది పొందారని టాక్. అప్పటికి ఇప్పటికి భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. దీంతో సర్ ప్లేస్ ల్యాండ్స్ పైనే అందరి దృష్టి ఉంది. వందల ఎకరాల భూములు ప్రభుత్వం చెప్పిన విధానానికి వ్యతిరేకంగా ఉండటంతో అధికారులు, నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటలా తయారయ్యింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులను గులాబీ నోట్లతో కోట్టడమే కాకుండా వ్యాపారంలో భాగస్వామ్యంగా చేర్చుకోవడంతో వేల ఫైల్స్ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా క్లియర్ అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనే అధికారుల ముఠా అక్షరాలా లక్ష కోట్ల స్కాంకి తెరతీసింది. దీనికి సంబంధించిన ఆధారాలను తొలివెలుగు క్రైం బ్యూరో సేకరించింది. ఎవరెవరికి ఎక్కడ భూములు క్రమబద్దీకరించారో ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి.
1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం పట్టణాల్లో 1000 చదరపు మీటర్లకు మించి ఇంటి స్థలం ఉండరాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1999లో ఈ యాక్ట్ ని రీఫిల్ చేశారు మన రాజకీయ నేతలు. అటు పట్టాదారుని చేతిలో కాని.. ఇటు ప్రభుత్వం ఆధ్వర్యంలో లేని భూములను రెగ్యులరైజ్ చేసుకోవాలంటూ క్రమంగా యూఎల్సీని 2008లో ఎత్తివేశారు. దీంతో హైదరాబాద్ లో వందల ఎకరాలకు వారసులైన వారంతా చట్టానికి లోబడి కబ్జాలు పెట్టించి.. చట్టబద్దం చేసుకున్నారు. మరికొన్ని భూములు కోర్టులో నలిగిపోతున్నాయి. మిగిలిన భూములను పేదల పేర్లు చెప్పుకుని బడాబాబులు దోచేసుకున్నారు. 166, 58, 59 జీవోలు కాకుండా ఎన్ని అక్రమ ఉత్తర్వులు తెచ్చుకున్నారో బట్టబయలు కాబోతున్నాయి.
ఈ మూడేళ్లలో లక్ష కోట్ల స్కాం ఎలా చేశారు.. భూములు ఎవరివి.. కబ్జా పెట్టింది ఎవరు.. ప్రభుత్వం ఇచ్చింది ఎవరికి.. ఎన్ని వందల ఎకరాలను క్లియర్ చేశారో పూసగుచ్చినట్లు వరస కథనాలను ప్రజల ముందుకు తీసుకురాబోతోంది తొలివెలుగు క్రైంబ్యూరో.