ప్రధానిమోడీకి టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. ప్రపంచంలో కొత్తగా ఏదైనా టెక్నాలజీ వస్తే.. దాన్ని భారత్ కు పరిచయం చేయాలని తహతహలాడుతారు. సామాజిక మాధ్యమాన్ని తనదైన శైలిలో వాడుతారు. ఫాలోవర్స్ ని ఎక్కువగా పెంచుకుంటారు. ట్విట్టర్ లో మోడీకి ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. ప్రపంచంలోనే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న జాబితాలో ఆయన ముందున్నారు.
తాజాగా.. యూట్యూబ్ లో కూడా ఆయన రికార్డ్ సృష్టించారు. ‘నరేంద్ర మోదీ’ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ చానల్ ను కోటి మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్ లో తెలిపింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఈ స్థాయి ఇమేజ్ మరొకరికి లేదు. కనీసం మోడీకి చేరువలో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం.
మోడీ తరువాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారోకు 36 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 30.7 లక్షల మంది ఫాలోవర్స్ తో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్ మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చానల్ ను 7.03 లక్షలు మంది మాత్రమే సబ్ స్క్రయిబ్ చేసుకోవడం గమనార్హం.
భారత్ లో మోడీ తరువాత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, శశి థరూర్ కు 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, ఎంకే స్టాలిన్ కు 2.12 లక్షల మంది, మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది చొప్పున యూట్యూబ్ లో ఫాలోవర్స్ ఉన్నారు.