సిరిసిల్ల, తొలివెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కమిటీ దీక్ష చేసింది.ఈ దీక్షకు సంఘీభావంగా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. సిరిసిల్ల ఇంచార్జ్ కెకె మహేందర్ రెడ్డి దీక్షా శిబిరాన్నిసందర్శించి గతంలో మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్టు హామీలు ఇచ్చారని అయితే ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేరలేదన్నారు.
మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని కూడా చెప్పి చేయలేదన్నారు.టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం మాటలు చెబుతూ సమయాన్నిగడిపేస్తున్నారని అన్నారు. వీర్నపల్లి ముస్తాబాద్ గంభీరావుపేట మండలలకు ఎల్లారెడ్డిపేట సెంటర్ పాయింట్ గా ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట లో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో పదహారు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.డిగ్రీ కళాశాల అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఇక దీక్షకు కూర్చున్నవారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, పందిర్ల లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సాహెబ్, మాజీ ఎంపిటిసి కొత్తపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.