జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లా లోని ధాంగ్రి గ్రామంలో నిన్న ఓ వర్గం వారిపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని పొట్టనబెట్టుకున్నారు. సుమారు 9 మందిని గాయపరిచారు. ఇది జరిగి 12 గంటలైనా గడవకముందే సోమవారం మళ్ళీ టెర్రరిస్థులు ఇదే గ్రామంలో గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారు.
నిన్న జరిగిన సంఘటనలో బాధిత కుటుంబం ఇంటివద్దే పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులో వచ్చిన ఉగ్రవాదులు ఒకవర్గం వారిని టార్గెట్ గా పెట్టుకుని ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ బాంబు పడిన చోటే మరో బాంబువంటి పేలుడు వస్తువును కూడా భద్రతా దళాలు కనుగొని పేలకుండా నిర్వీర్యం చేశాయి. ఆదివారం జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ గ్రామంలో సెక్యూరిటీని ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ 12 గంటల్లోనే రెండో ఉగ్రదాడి జరగడం భద్రతా దళాలను కలవరపెడుతోంది. తాజాగా డ్రోన్లను, స్నిఫర్ డాగ్స్ ని కూడా వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఈ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.