కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి దద్దరిల్లింది. వాషింగ్టన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ బాలుడు మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వైట్ హౌస్ కు సుమారు రెండు మైళ్ల దూరంలో యూస్ట్రీట్ నార్త్ వెస్ట్ లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ లో కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించినట్టు పేర్కొన్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వివరించారు. అయితే కాల్పులకు గల కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఇటీవల టెక్సాన్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మే 24న టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. గన్ కల్చర్ పై ఇప్పటికే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.