– ఉక్రెయిన్ లో నవీన్ చావుకు కారణం ఎవరు..?
– దేశంకాని దేశంలో ఎందుకు బలిపశువయ్యాడు?
– ఈ పాపం రష్యాదా..?నిద్ర నటించే మన నేతలదా?
ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం..అంటే మరో రెండేళ్లయితే పీజీ కూడా చేసి డాక్టర్ అవుతాడు.కుటుంబానికి అండగా నిలబడతాడు. అలాంటి చురుకైన విద్యార్థి హఠాత్తుగా చనిపోతే. అది కూడా దేశం కాని దేశంలో.. ఎవరెవరికో మధ్య జరిగిన యుద్ధంలో అకారణంగా బలైపోతే. ఆ కుటుంబం గుండెకోత ఊహించడానికే కష్టంగా ఉంటుంది. కర్నాటకకు చెందిన నవీన్ తల్లిదండ్రుల పరిస్థితి ఇది.
కీవ్ ప్రాంతంలో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న నవీన్..బంకర్ లో తలదాచుకున్నప్పటికీ, ఆహారం కోసం బయటకు రావాల్సి వచ్చింది. కానీ అదే అతని ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక రేపో మాపో భారతీయ విమానాల్లో తమ కొడుకు కూడా తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న నవీన్ పేరెంట్స్ కైతే ఇది పిడుగుపాటు లాంటి వార్తే.
ఇక్కడ కంటతడి పెట్టించే విషయం ఏంటంటే.. చదువు రాకో..లేక కేవలం డబ్బుతో చదువు “కొన” టానికో నవీన్ ఉక్రెయిన్ వెళ్లలేదు. నవీన్ తండ్రి మాటల్లోనే చెప్పాలంటే.. చాలా చురుకైన విద్యార్థి నవీన్. ప్లస్ టూ లో 97 శాతం మార్కులు తెచ్చుకున్ననవీన్..కేవలం భారత్ లో సీటు దొరక్క ఉక్రెయిన్ వెళ్లాల్సి వచ్చింది. అంటే అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి అయినప్పటికీ.. ఇక్కడ సీటు రాక..సీటు లేక.. దూరతీరాలకు వెళ్లి.. వాళ్ల యుద్ధంలో బలి కావాల్సి వచ్చింది. ఇది ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక్కడ కొన్ని విషయాలు కచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నవీన్ సమస్యో… ఆ తల్లి గుండెకోతకు సంబంధించిన సమస్యో కాదు.. దేశంలో ఇంకా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులకు సంబంధించిన సమస్య.
అది యూపీఏ ప్రభుత్వమైనా..ఎన్డీయే ప్రభుత్వమైనా..దేశం వెలిగిపోతుందని ఢంకా బజాయించే మహా మహా నాయకులు కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలివి. విద్య రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కనీసం అలాంటి విద్యా హక్కు విషయంలో మన ప్రభుత్వాల శ్రద్ధకు ప్రత్యక్ష ఉదాహరణ..నవీన్ లాగా వలసపోయే వేలమంది విద్యార్థులు. నిజానికి ఇక్కడే ..ఇండియాలోనే సీట్లు దొరికితే కొన్ని లక్షల మంది బయట దేశాల్లో చదవటానికి వెళ్లుండే వాళ్లు కాదు కదా. ఇవాళ ఒక్క ఉక్రెయిన్ లోనే దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులున్నట్టు..మనకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తెలిసింది. ఇక పోలండ్, హంగరీ, ఫిలిప్పీన్స్..ఇలా వివిధ దేశాల్లో చదువుల కోసం మన బిడ్డలు ఎన్నెన్ని అగచాట్లు పడుతున్నారో ఎవరికి తెలుసు…? ఓట్ల రాజకీయాలే ధ్యేయంగా బతికే మన నేతలు ఎప్పుడైనా .. ఈ దిశగా ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా అనేది దేశవాసులను కలవరపెడుతున్న ప్రశ్న.
నిజానికి ఇక్కడే చదువుకో గలిగే అవకాశం ఉంటే.. ఇలా ఎందరో తల్లులకు గర్భశోకం ఉండేది కాదు కదా. దారుణం ఏంటంటే మనకంటే అభివృద్ధిలో ఎంతో దయనీయ స్థితిలో ఉన్న దేశాలు, మనకంటే చిన్నదేశాలకు కూడా మన పిల్లలు మెడిసిన్ లాంటి చదువుల కోసం వెళుతున్నారంటే ఆ వైఫల్యం ఎవరిది..? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా..లేదా..? 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎంతమందికి ఒక డాక్టర్ ఉన్నాడు..? వైద్యుల కొరతతో ప్రాణాలు పోతున్నఘటనలు ఎన్నో మనం మీడియాలో చూస్తుంటాం.. ఆ లెక్కన మన దేశంలో కావాల్సినంత మంది డాక్టర్లు లేరనే కదా..? మరి అలాంటప్పుడు..మన దగ్గరే మెడికల్ కళాశాలల సంఖ్య పెంచితే.. ఇలా విమానాలకు లక్షల్లో పెట్టి.. అక్కడి కాలేజీలకు లక్షల్లో పెట్టి.. ఆఖరికి బతికి స్వదేశానికి వస్తామో రామో తెలియని పరిస్థితుల్లో మన విద్యార్థులు ..వలసలు పోనక్కర్లేదు కదా..? ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలు తిరిగి క్షేమంగా వచ్చేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని … భయంభయంగా ఎదురుచూడక్కర్లేదు కదా..?
ఈ నేపథ్యంలో..ఇప్పుడు చెప్పండి..? కర్నాటక విద్యార్థి నవీన్ ఉక్రెయిన్ లో మరణించటానికి కారణం ఎవరు…? రెండు దేశాల మధ్య యుద్ధమా..? మన దేశంలో మన ఓట్లతో గద్దెనెక్కి మనమంటే లెక్కలేని.. మన నాయకుల అలసత్వమా..?