– సర్ ప్లేస్ భూదందా.. సరూర్ నగర్ రూటే సప”రేటు”
– 3 వేల అప్లికేషన్లు.. దర్జాగా కబ్జాకు దిగిన బడాబాబులు
– వేల ఎకరాలు ఉన్నా పేదలకు సెంట్ భూమి ఇవ్వని కేసీఆర్
– పేదలకు చెందాల్సిన స్థలాల్లో పెద్దల గద్దలు
– అధికారపార్టీ అండదండలతో ప్రైవేట్ లే అవుట్స్
– కేటీఆర్ ఫ్రెండ్ అంటూ ఫైడ్ ఇండియా ఆగడాలు
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో పక్కా ఆధారాలు
లక్ష కోట్ల భూ స్కాంపై తొలివెలుగు క్రైంబ్యూరో ఆధారాలతో సహా బయటపెడుతుండడంతో అక్రమర్కుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందా అని భయం ఎక్కువైంది. కానీ.. ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఎక్కడ ఏ భూమి కబ్జా అయింది.. ఎవరిని మ్యానేజ్ చేస్తోంది.. ఎంత దోచుకుందీ.. పక్కా ఆధారాలతో సంచలన కథనాలు ప్రజలు ముందుకు రాబోతున్నాయి. పాత సరూర్ నగర్ మండలం బాలాపూర్ లో యూఎల్సీ సర్ ప్లేస్ ల్యాండ్ భారీగా ఉంది. ఎప్పటి నుంచో ఆ భూముల్లో పేదవారు ఇళ్లు నిర్మించుకొని ఉన్నారు. కొంత మంది అధికారపార్టీ బలంతో వందల ఎకరాలు లే-అవుట్ చేసి అమ్ముకున్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఇప్పుడు చేయడం లేదు. అయినా.. మిగిలిన ప్రభుత్వ మిగులు భూములను కాపాడటంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. సర్కార్ భూముల్లో యథేచ్ఛగా కార్పొరేట్ కంపెనీలకు ముట్టజెప్పారు. అయితే.. ఆ వివరాలు యూఎల్సీ రికార్డుల్లో ఉన్నా రెగ్యులరైజేషన్ చేశారా లేదా అనేది తెలపకుండానే విచ్చలవిడి అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహస్య ఒప్పందాలతో వందల ఎకరాలకు ఎగనామం పెట్టేశారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా నిలువ జాగా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూంలు అంటూ గొప్పలు చెప్పుకుని పేదలకు సొంత ఇంటి కల నేరవేర్చకుండా పెద్దలకు కోట్ల వర్షం కుమ్మరించి ప్లాట్స్ కొనుగోలు చేసుకున్న తర్వాత క్రమబద్దీకరణ అంటూ మళ్లీ సామాన్యుడి ముక్కు పిండి ఆదాయం రాబట్టుకుంటున్నారు.
జీవో 166 రద్దు అంటూ జీవో 92తో దందా!
అర్బన్ సీలింగ్ యాక్ట్ ప్రకారం.. మిగులు భూములు అన్నీ ప్రభుత్వానివే. అవి పేద ప్రజలకు పంచి ఇవ్వాలి. పేదలు అప్పటికే అందులో ఉంటే రెగ్యులరైజేషన్ చేయాలి. కానీ.. సెంట్ భూమి ఇవ్వకుండా బడాబాబుల చేతిలో ఉండే పదుల ఎకరాలను రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్లాన్ వేసింది తెలంగాణ సర్కార్. అందుకే మూడో కంటికి తెలియకుండా క్రమబద్దీకరణ చేస్తోంది. సరూర్ నగర్, బాలాపూర్ మండలాల్లో కొన్ని సర్ ప్లేస్ ల్యాండ్ వివరాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది తొలివెలుగు క్రైం బ్యూరో.
1. బాలాపూర్ సర్వే నెంబర్ 112,113,116 లో ఫైల్ నెంబర్ D1/2709 నుంచి 2711/76 వరకు 47 వేల 246 గజాల ప్రభుత్వ భూమి తమదేనని రెగ్యులరైజేషన్ కి పెట్టుకున్నారు. ఇందులో పన్నాల శ్రీనాథ్ రెడ్డి, మేకల శ్రీనివాస్ లు ఉన్నారు. అగ్రికల్చర్ గా చూపిస్తూ యూఎల్సీకి 10 ఎకరాలు అప్లికేషన్ పెట్టుకున్నారంటే జీవో నెంబర్ 92 దేనికి నిదర్శనం.
2. జల్ పల్లిలో రాజాకుమారి తండ్రి పేరు జగన్ మోహాన్ రావు. ఈమె ఏకంగా 36 వేల గజాల చెరువును కబ్జా చేసి జీవో 92 ప్రకారం క్రమబద్దీకరించండి అని 2016లో అప్లికేషన్ పెట్టుకుంది. సర్వే నెంబర్ 230/2 లో హుడా సాగర్ ఎఫ్‌టీఎల్ లో 19 వేల 234 గజాలు, 225/2, 231/2 సర్వే నెంబర్ లో 16 వేల 177 గజాలు కబ్జా చేసింది. చెరువుని మింగేసి నీళ్లు తాగుతున్న వారికి కూడా 92 జీవో జీవనాధారంగా కబ్జా చేసుకునేందుకు వీలుగా మారింది.
3. బాలా పూర్ సర్వే నెంబర్ 144/పి, 145/పి లో 75 వేల 532 గజాల భూమిని క్రమబద్దీకరించాలని కోరారు.
4. సర్వే నెంబర్ 134/పి లో మొత్తం 8 వేల 687 గజాల భూమి కోంస ఎం దయానంద్ రెడ్డి, కే మల్లారెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో సగం భూమి క్లియర్ చేసినట్లు సమాచారం.
5. జల్ పల్లిలోని సర్వే నెంబర్ 73,74,123,131 నుంచి 135 వరకు వాహిద్ హుడా కాలనీ అని లే అవుట్ చేశారు. మొత్తం 225 మంది 60 వేల 899 గజాల భూమిని క్రమబద్దీకరించాలని కోరితే.. ఐదుగురికే 21 వేల 234 గజాల భూమి ఉందని కలెక్టర్ కి ఫైల్ పెట్టారు. వారు ఎంఏ హాసన్, మూసా, అముత్ల్ ఆలీ, హానన్.
6. తెలంగాణ ప్రభుత్వం రాగానే ఫ్రైడ్ ఇండియా అంటూ దుబాయ్ నుంచి వచ్చిన సానోబేర్ బైగ్.. బాలాపూర్ సర్వే నెంబర్ 285, 286, 287, 333, 337, 339, 340, 341, 342, 344 ,352లో మొత్తం 20 ఎకరాల్లో ఆర్చిడ్ వెంచర్, గ్రీన్ సిటీ వెంచర్స్ అని పేరు పెట్టి కబ్జా చేసుకుంది. వెయ్యి ప్లాట్స్ అమ్ముకుంది. వాటన్నింటిని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని జీవో నెంబర్ 92, 58, 59 కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ చేసింది ఒక్కరే వారికి అడ్రస్ లు లేవు. ఒకటే ఫోన్ నెంబర్ పెట్టి దందా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే రంగారెడ్డి జిల్లాలో వేల ఫైల్స్ ఉన్నాయి. వాటన్నింటిని కలెక్టర్ దాచిపెట్టారు. తెర వెనుక తతంగం నడిపిస్తున్నారు. అందుకే లక్ష కోట్ల సర్ ప్లేస్ మిగులు భూముల స్కాం అంటూ తొలివెలుగు క్రైం బ్యూరో వరస కథనాలు ఇస్తోంది. రంగారెడ్డిలోనే 8 మండలాల్లో ఏం జరిగిందో పార్ట్- 3లో తెలుసుకుందాం. అలాగే ఓ మంత్రి వ్యవహారం, మాజీ డీజీపీ భూ క్రమబద్దీకరణ విషయాల గురించి తెలుసుకుందాం.