కేసీఆర్ ఫ్యామిలీ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు మాట్లాడడంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు ఎవరు లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రం పరువును ఢిల్లీలో తీశారని అన్నారు. లిక్కర్ స్కాం లో ఒక మహిళ ఉండడం తానెప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చారని ఫైరయ్యారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్, కవిత కేంద్రం గురించి పచ్చి అబద్దాలు మాట్లాడారని సీరియస్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి ఉందా.. అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీ.. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుందా అని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ నేతలను ముందు ఎంఐఎం ఒప్పిస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కొత్త నాటకానికి కల్వకుంట్ల ప్రభుత్వం తెరలేపిందన్నారు. సానుభూతి కోసం దీక్ష పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం లో ఆరోపణలు రావడంతోనే మహిళా రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని విమర్శించారు.
రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని పంపని మీరు మహిళా రిజర్వేషన్ల గురించి ఎలా మాట్లాడుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై నుంచి దృష్టి మరలించాలనే ధర్నా నాటకానికి తెరలేపారని.. సీఎం కూతురికి ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం ఉండదన్నారు కిషన్ రెడ్డి.