గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజైనప్పుడు ఎంత కంపారిజన్ నడిచిందో అందరం చూశాం. లూసిఫర్ లో మోహన్ లాల్ క్లిప్పింగ్స్, గాడ్ ఫాదర్ లో చిరంజీవి క్లిప్పింగ్స్ ను పక్కపక్కనపెట్టి చాలా పోలికలు పెట్టారు. ఈ సందర్భంగా అటు మోహన్ లాల్ పై, ఇటు చిరంజీవిపై కూడా ఓ మోస్తరు ట్రోలింగ్ నడిచింది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ దుమ్మెత్తిపోసుకున్నారు కూడా.
ఓవైపు అది అలా కొనసాగుతుండగానే, ఇప్పుడు పోలికలు పెట్టడానికి మరో సినిమా అందుబాటులోకి వస్తోంది. దాని పేరు ఓరి దేవుడా. గాడ్ ఫాదర్ తరహాలో ఇది కూడా మలయాళం సినిమా రీమేకే.
మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ మై కడవులే సినిమాను తెలుగులో ఓరి దేవుడా (టైటిల్ కూడా మార్చలేదు) పేరుతో రీమేక్ చేశారు. మలయాళంలో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తే, తెలుగులో ఆ పాత్రను విశ్వక్ సేన్ పోషించాడు. అయితే ఇక్కడ కంపారిజన్ చేయబోయేది వీళ్ల గురించి కాదు.
మలయాళం వెర్షన్ లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో నటించాడు. ఇప్పుడీ తెలుగు వెర్షన్ లో విజయ్ సేతుపతి పాత్రను వెంకటేష్ పోషించాడు. సో.. త్వరలోనే విజయ్ సేతుపతి, వెంకటేష్ పాత్రల మధ్య కంపారిజన్ చేయబోతున్నారు జనం.
వెంకటేష్ కు ఇలాంటివి కొత్త కాదు. టాలీవుడ్ లో అత్యథిక రీమేక్స్ చేసిన హీరోగా గుర్తింపు పొందిన వెంకీ, ఏ పాత్రను ఎంచుకున్నా దానికి 2వందల శాతం న్యాయం చేస్తాడు. ఒరిజినల్ మూవీలో విజయ్ సేతుపతి బాగా చేశాడు, అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి మాత్రం వెంకటేష్, తనదైన మేనరిజమ్స్ తో మేజిక్ చేయడం ఖాయం. ఇందులో కూడా ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు.