అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణపై టీఆర్ఎస్ నేతలు.. ఒకరి తర్వాత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపగా.. చివరికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఇక ఇటీవలే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి.. రాముడు ఎక్కడో పుట్టాడో తెలియదంటూ వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. ఇక తాజాగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ జాబితాలో చేరారు.
భద్రాచలంలో మాకూ రాముడు ఉన్నాడు.. నీ రాముడు ఎవరికి కావాలి.. అయోధ్యలో ఇప్పుడు గుడి కడితే అక్కడ రాముడు ఉన్నట్టా.. రాజకీయాల కోసం మాట్లాడటం కాదు.. మేం దేవుడిని కాదనడం లేదు.. దేవుడు అందిరికీ దేవుడే అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. కాగా నేరుగా బీజేపీ నేతలపై విమర్శలు చేయకుండా.. టీఆర్ఎస్ నేతలు అయోధ్య, భద్రాచలం అంటూ రాముడిని వేరు చేసి మాట్లాడటం, కించపరచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.