ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గతంలో భారత్ ప్రపంచ దేశాలపై ఆధారపడగా ఇప్పుడు ఆ దేశాలు భారత్ పై ఆధారపడుతున్నాయని ఆమె చెప్పారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె.. ప్రధాని మోడీ ప్రభుత్వం చేబట్టిన అనేక విజయాలను ప్రస్తావించారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందని, ఈ దేశం మునుపెన్నడూ లేనంతగా ఆత్నవిశ్వాసంతో పురోగమిస్తోందని ఆమె చెప్పారు.
పేదరికం లేని నవభారతావని నిర్మాణం కోసం కృషి జరుగుతోందని, ఫసల్ బీమా యోజన, జల్ జీవన్, కిసాన్ కార్డ్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆత్మనిర్భర్ నినాద స్ఫూర్తితో సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను మనమే తయారు చేసుకుంటున్నామని, సైన్యంలో మహిళలకు కూడా ఎన్నో అవకాశాలు కల్పించామని ఆమె అన్నారు. పేదలకు ఇళ్ళు, వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి జరుగుతున్న కృషిని ఆమె వివరించారు.
నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోందని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ప్రారంభించామని, గిరిజనుల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. బేటీ పడావ్, బేటీ బచావ్ నినాద స్ఫూర్తితో స్కూళ్లలో బాలికల విద్యను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, స్కూళ్లలో డ్రాపవుట్స్ తగ్గించేలా అనేక చర్యలు చేబట్టామన్నారు. తొలిసారిగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిపాం.. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.. మూడు కోట్లమందికి సొంత ఇళ్ళు నిర్మించాం.. మహిళా సాధికారతను మరింతగా ప్రోత్సహిస్తున్నాం అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయని, పేదరికం లేని భారత నిర్మాణం కోసం అవిరళ కృషి సాగుతోందని, చెప్పిన ఆమె.. భారత డిజిటల్ నెట్ వర్క్ వ్యవస్థను ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయన్నారు. డిజిటల్ ఇండియా దిశగా ముందుకు సాగుతున్నామని, అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం జరుగుతోందన్నారు. కరోనా అధిగమించేందుకు కేంద్రం కఠినమైన, స్థిర నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందన్నారు. రాబోయే పాతికేళ్లలో వికసిత భారత దేశం దిశగా అడుగులు పడతాయన్న విశ్వాసం తనకుందని ఆమె చెప్పారు. సర్జికల్ దాడుల ద్వారా సరిహద్దులు దాటిన ముష్కరమూకలను మట్టుబెట్టామన్నారు.