ధరణి… ప్రభుత్వంలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం.. భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం దీని లక్ష్యం. కానీ.. ఇది వచ్చాకే సమస్యలు మరింత పెరిగాయనేది ప్రతిపక్షాల వాదన. రైతుల ఆవేదన. ధరణి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భూ సంస్కరణలపై కేంద్రం కూడా కీలక అడుగులు వేస్తోంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ ను పార్లమెంట్ ముందుంచారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(ఎన్జీడీఆర్ఎస్) ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
ఈ విధానం వల్ల దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ఓ ఆధునిక వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించారు నిర్మల. ఈ పథకం మంచిదేనని అంటున్నారు నిపుణులు. సరిగ్గా అమలు చేస్తే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.
మరోవైపు దేశంలోని పౌరుల సౌకర్యార్థం కోసం ఈ-పాస్పోర్ట్ లను 2022-23 నుంచి జారీ చేయనున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి. ఇందుకోసం కొత్త సాంకేతికతను ఉపయోగించనున్నట్లు వివరించారు. అలాగే మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ కోసం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు వివరించారు.