దేశంలో కరోనా వైరస్ తిరగబెడుతున్న వేళ.. కేంద్ర ఆరోగ్యశాఖ మరో ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. కరోనా సోకిన వ్యక్తులు ఒకరకంగా మానవ బాంబులాంటి వారేనన్నట్టుగా చెప్పింది. కరోనా సోకిన వ్యక్తి బహిరంగంగా సంచరించినా.. ఆ విషయం తెలియని సాధారణ ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించకపోయినా తీవ్రమైన ముప్పు తప్పదని హెచ్చరించింది.
మాస్కులు, వ్యక్తిగత దూరం వంటి కరోనా నివారణ చర్యలు అనుసరించకపోతే ఆ దుష్పరిణామం ఊహించలేమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అది ఎంతలా ఉంటుందంటే.. కరోనా పాజిటివ్ ఉన్న వ్యకి.. 30 రోజుల్లో సగటున 406 మందికి తన ద్వారా కరోనా వైరస్‌ను అంటించే అవకాశం ఉందని హెచ్చరించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే.. ఒక గ్రామంలో ఎవరైనా ఒక వ్యక్తికి కరోనా సోకితే.. అతని లేదా చుట్టూ ఉండేవారు ఆజాగ్రత్తగా వ్యవహరిస్తే.. నెల రోజుల్లో ఆ గ్రామాన్ని కరోనా చుట్టేయగలదన్నమాట. కానీ ప్రజలు ఇంకా అప్రమత్తం కాలేకపోతున్నారు. కరోనాను నియంత్రించాలంటే మాస్కులు ధరించడం ముఖ్యమని 90 శాతం ప్రజలకు తెలిసినా.. 44 శాతం మందే మాత్రమే అందుకు ఆసక్తి చూపిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, గతేడాది కంటే వేగంగా ఈసారి దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. మొన్నటివరకు మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే తీవ్రత కనిపించింది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.