థాంక్యూ మూవీ విడుదలైన మొదటి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశాయి కొన్ని వెబ్ సైట్లు. అసలే థియేట్రికల్ సిస్టమ్ రూపురేఖలు మారిపోతున్న నేపథ్యంలో, ఆక్యుపెన్సీ అరకొరగా ఉంటున్న వేళ.. ఈ నెగెటివ్ టాక్ తో పూర్తిగా పడిపోయింది సినిమా. దీనికితోడు తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం బరిలోకి దిగడంతో, ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్.
అవును.. థాంక్యూ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ థియేటర్ బయట బోర్డులు పెట్టారు. అలా అని టికెట్ రేటు పెంచలేదు. కేవలం 70 రూపాయలు మాత్రమే ఉంచారు. మరికొన్ని థియేటర్లలోనైతే పూర్తిగా టికెట్ రేట్లు తగ్గించారు. సీమలోని కొన్ని థియేటర్లలో బాల్కనీ టికెట్ ను 50 రూపాయలకే అందిస్తూ వచ్చారు.
అయితే.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ థాంక్యూ మాత్రం కోలుకోలేకపోయింది. నాగచైతన్య కెరీర్ లో టాప్-3 డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. అటు దిల్ రాజు, విక్రమ్ కుమార్ కెరీర్లలో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ట్రేడ్ అంచనా ప్రకారం, వచ్చే వారాంతానికి ఈ సినిమా క్లోజింగ్ దశకు చేరుకుంటుంది. ఇప్పటికే బయ్యర్లంతా నష్టపోయారు. వీళ్లంతా దిల్ రాజు రెగ్యులర్ పార్టనర్స్ కావడంతో, ఎవ్వరూ బయటకొచ్చి ఆందోళన చేయలేదు. దీనికి మరో కారణం దిల్ రాజు చేతిలో ఉన్న రామ్ చరణ్, శంకర్ సినిమా. ఈ నష్టాలను, ఆ సినిమాతో దిల్ రాజు భర్తీ చేస్తాడని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.