రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ కాలేజీతోపాటు తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పనపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు పంపించింది.
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల్లో అమ్మాయిలకు తగిన వసతులు కల్పించాలని ఛీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. సరైన వసతులు లేకుంటే ఆడపిల్లలకు రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు చదువుకోవడానికి ఉన్న అవకాశాలను వారికి దక్కకుండా చేయోద్దని సూచించారు.
సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీలో అసలు కనీస వసతులు లేవని ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని చూసి ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ పలుమార్లు అధికారులకు లేఖలు రాశారు. అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు. మరుగుదొడ్ల సౌకర్యం లేని కారణంగా అనేక మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు రుతుస్రావం సమయంలో పలువురు అమ్మాయిలు అసలు కాలేజీకి కూడా రావడం లేదన్నారు. ఈ క్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు కాలేజీకి రావడం మానేశారని తెలిపారు. మరోవైపు అబ్బాయిలు టాయిలెట్ కోసం బయట ప్రాంతాలకు వెళుతున్నట్లు వెల్లడించారు.గత మూడు నెలలుగా అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో మణిదీప్ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.
అయినా కూడా అక్కడి ఛైర్మన్ సహా సభ్యులు కూడా లేకపోవడంతో హైకోర్టుకు లెటర్ రాసినట్లు మణిదీప్ స్పష్టం చేశారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించి అధికారులకు నోటీసులు జారీ చేసింది.