టీఆర్ఎస్ నాయకుడు, మేడ్చల్ జిల్లా జాగృతి కన్వీనర్ ఈగ సంతోష్ నుండి తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు ఓ బాధితుడు. ఉప్పల్ చిలక నగర్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి 2017 లో అదే ప్రాంతంలో 153 గజాల భూమిని కొనుగోలు చేసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్స్ తో ఇప్పుడా భూమిని సంతోష్ కబ్జా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు బాధితుడు.
అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మనుషులమని తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీ ని కోరాడు. తన కష్టార్జితంతో కొనుకున్నానని.. ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేయడమే కాకుండా.. చంపుతామని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నరని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ విషయంపై ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయవలసిన పోలీసులే భూకబ్జాదారులతో కుమ్మకై వేధింపులకు గురి చేస్తున్నారని కంటనీరు పెట్టుకున్నాడు.
కాపాడాల్సిన పోలీసులే కబ్జాదారులకు కొమ్ముకాస్తుంటే తమ గోడును ఇంకెవరికి చెప్పుకోవాలని వాపోయాడు. స్థానికి ఎమ్మెల్యే, జాగృతి నాయకుడు ఈగ సంతోష్ ల నుండి ప్రాణ హానీ ఉందని.. తనకు రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని కోరాడు. వారిపై చర్యలు తీసుకొని తన భూమి తనకు ఇప్పించాలని బాధితుడు వేడుకున్నారు.