హైదరాబాద్, తొలివెలుగు: సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారం రోజులపాటు అతను పోలీస్ కస్టడీలోనే ఉండనున్నాడు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టు అనుమతించింది. దర్యాప్తులో భాగంగా నవీన్ ను హత్య చేసిన స్థలానికి హరిని తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.
యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి.. నవీన్ ను ఎలా హత్య చేశాడో ఇంకా డీటెయిల్ గా తెలుసుకోనున్నారు. మరోవైపు హత్యకు కారణమైన యువతి ఏమీ నోరు విప్పడం లేదని తెలుస్తోంది. పోలీసులు ఎంత అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదట. నవీన్ దిల్ సుఖ్ నగర్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా హరికృష్ణతో పరిచయమైంది.
మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్ కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహరకృష్ణకు కూడా తెలుసు. నవీన్ బీటెక్ కోసం నల్గొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కాలేజీలో చేరారు. నవీన్ అక్కడకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా హరి స్నేహం పెంచుకుని ప్రేమించడం మొదలుపెట్టాడు.
ఇది తెలిసి నవీన్ కూడా ఆమెకు టచ్ లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి ఆమెను దక్కించుకోవాలని మర్డర్ ప్లాన్ వేశాడు. నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం ప్రకారం హత్య చేశాడు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడ్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.