దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటన జరిగి ఏడాది అవుతోంది. నవంబర్ 27న హైదరాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో బైక్ పార్క్ చేసి వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను.. పంక్చర్ పేరుతో డ్రామా ఆడి నలుగురు దుర్మార్గులు చెరబట్టారు. బలవంతంగా లారీలో తీసుకెళ్లి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి.. ఆతర్వాత సజీవ దహనం చేశారు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మరుసటి రోజే చేధించారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు జరిగాయి. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో నిందితులని పోలీసులు ఘటనా స్థలంలోనే ఎన్‌కౌంటర్ చేశారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినా.. మానవహక్కుల సంఘంతో పాటు పలు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్దేశపూర్వకంగానే నిందితులను చంపేశారంటూ పోలీసులపై ఫిర్యాదు చేశాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాటిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.