కరోనా మహమ్మారి అనేక ప్రాణాలను బలిగొన్నది. ఇప్పటికే సెకండ్ వేవ్ డెల్టా రూపంలో లక్షలాది ప్రాణాలను కరోనా మింగేసింది. అయితే… కరోనా కట్టడిలో దేశం వ్యాప్తంగా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఆదివారానికి ఏడాది పూర్తవుతోంది.
2021, జనవరి 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 156 కోట్ల డోసులు అందించింది. 90 కోట్ల మందికిపైగా తొలి డోసు, 65 కోట్ల మందికిపైగా రెండు డోసులు, 42 లక్షల మందికిపైగా ప్రికాషనరీ డోసులు అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది భారత్.
ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీకా పంపిణీగా పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా. ట్విట్టర్ వేదికగా టీకా ప్రారంభమైన నాటి నుంచి సాధించిన కీలక మైలురాళ్లను వెల్లడించారు.
భారత్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రక్రియ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుచూపుతో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారని అన్నారు. కరోనాపై దేశ సమ్మిళిత పోరాటాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తోందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ గొప్పతనాన్ని టీకా పంపిణీ స్పష్టం చేస్తుందని తెలిపారు మాండవీయా.