యుద్దాలతో ఇప్పటి వరకు ఏం ఒరిగింది.. యుద్దాలు ఎంతలా మానవాళి వినాశనానికి కారణమవుతాయన్నది మొదటి, రెండో ప్రపంచయుద్దాలతో ప్రపంచ దేశాలకు తెలిసింది. కాని ఆ గుణపాఠాన్ని ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24న అంటే ఇదే రోజున ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ప్రారంభించాయి.
ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రష్యాలు బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ దేశంపై దీని ఎఫెక్ట్ పడింది. అయితే వెస్ట్రన్ దేశాలు ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నించడంతో రష్యా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని రష్యా భావించింది.
నాటోలో చేరొద్దని ఉక్రెయిన్ ని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం రష్యా బెదిరింపులను పట్టించుకోకుండా నాటోలో చేరేందుకే మొగ్గు చూపాడు. దీంతో యుద్దానికి బీజం పడింది. అయితే యుద్ధం ప్రారంభానికి ముందు బలమైన సైన్యం, ఆయుధ సంపత్తి కలిగిన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఎదురొడ్డి పోరాడుతోంది.
యుద్ధంలో గెలవకపోయినా.. ఎదురొడ్డి నిలబడుతోంది. ముందుగా రష్యా సేనలు రాజధాని కీవ్ నగరాన్ని చేరుకున్నా.. దాన్ని దక్కించుకోకుండా ఉక్రెయిన్ సైన్యం నిలువరించగలిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ తోపాటు రెండు పెద్ద నగరాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.ఇదిలా ఉంటే జెలన్ స్కీ మాత్రం అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలను కోరుతూ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఉక్రెయిన్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు సాగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.