న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.60 !! ఢిల్లీ మధ్యతరగతి కుటుంబాల వారు తమ నిత్యావసర సరుకుల జాబితా నుంచి ఉల్లిని మినహాయించారు. భారీవర్షాలు, వరదలతో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లి ఢిల్లీలోని రిటైల్ మార్కెట్‌కు రావడం లేదు. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి.
పదిరోజుల క్రితం ఢిల్లీలో ఉల్లి హోల్ సేల్ ధర కిలో రూ.15 కాగా రిటైలర్లు రూ.25 నుంచి రూ.30 రూపాయల దాకా విక్రయించేవారు. వరదలతో ఉల్లి ఢిల్లీ మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్థుతం ఢిల్లీలో కిలో ఉల్లి ధర 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. డిమాండు కంటే తక్కు ఉల్లి వస్తుండటంతో కొరత వల్ల దీని ధర పెరిగిందని వ్యాపారులు చెప్పారు.
మన దగ్గర కూడా ఉల్లి రేటు జనాలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లిపాయల రేటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో 40 రూపాయిల వరకు వుంది. మొన్నటిదాకా క్వింటాల్ ఉల్లి ధర 1 ,600 పలికితే ఇప్పుడు ఏకంగా రూ,3 ,310 దాకా పెరిగింది . ఉల్లి సాగు 12 వేల నుంచి 8 వేల హెక్టార్లకు పడిపోవడంతో ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడి రేటు కూడా భారీగా పెరిగినట్లు కర్నూల్ మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు.