కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతా చౌదరి సూసైడ్ కేసులో మరో కోణం వెలుగుచూసింది. మృతురాలు ఆన్ లైన్ మాయగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. రూ.1.20 లక్షలు చెల్లిస్తే రూ.7 లక్షలు ఇస్తామని ఆమెను నమ్మించాడు ఓ చీటర్. ఈ క్రమంలోనే రూ.1.30 లక్షలు పంపించింది శ్వేతా చౌదరి.
పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని శ్వేతా ఆశించిన రాలేదు. రూ.7 లక్షలు రాకపోవడంతో మోసపోయానని మనస్తాపానికి గురైంది. తల్లికి మెసేజ్ పెట్టి విజయవాడలో ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన శ్వేతాచౌదరి హైదరాబాద్ లోని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తోంది. కరోనా కారణంగా గత మూడు నెలలుగా తన స్వస్థలం నుండే పని చేస్తోంది. అయితే.. ఆమెకు ఆన్ లైన్ లో గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈక్రమంలోనే వాడి చేతిలో దారుణంగా మోసపోయింది. రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.7 లక్షలు వస్తాయని ఎర వేయగా బుట్టలో పడిపోయింది.
ఆగంతకుడు చెప్పినట్టుగానే డబ్బులు చెల్లించగా.. రూ.7 లక్షలు రాలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న శ్వేత తట్టుకోలేకపోయింది. శనివారం సాయంత్రం స్కూటీ తీసుకుని రాత్రి 8 గంటల సమయంలో చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందే తన ఆత్మహత్య గురించి తల్లికి మెసేజ్ పంపింది. ఈ వారాంతంలో బంధువులతో కలిసి శ్వేత హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.