ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్ సాధారణం అయిపోయింది. అసలు స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే, టెక్నాలజీ వల్ల ఎంత మంచి ఉందో.. అంతా చెడు కూడా ఉందనేది వాస్తవం. ముఖ్యంగా టీనేజర్ సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చిత్తోడ్‌గఢ్‌లో వెలుగులోకి వచ్చింది.
బాన్సెన్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అన్సారీ అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్ విపరీతంగా ఆడేవాడు. గంటల కొద్దీ మొబైల్ ఫోన్ పట్టుకునే ఉంటాడు. అయితే, గత గురువారం రాత్రి సడెన్‌గా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఒక్కసారిగా మతి తప్పినట్లు ప్రవర్తించటం మొదలుపెట్టాడు. శుక్రవారం ఉదయం ఉదయ్‌పుర్ రహదారిపైకి చేరి వాహనాలను ఆపుతూ పాస్వర్డ్స్ మార్చుకోవాలని అరవటం చేశాడు.
గమనించిన స్థానికులు పట్టుకుని మంచానికి కట్టేశారు. కుటుంబ సభ్యులకు అప్పగించగా.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మానసిక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి గేమ్స్ ఆడితే ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని వారు చెప్పారు.
అన్సారీ గతంలో బిహార్‌లోని చప్రా ఏరియాలో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్‌లోని బాన్సెన్కు వచ్చాడు. ఫైరింగ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నట్లు గుర్తించామని కుటుంబసభ్యులు తెలిపారు. అదే పనిగా మీ పిల్లలు కూడా ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారా..? ఎప్పుడూ ఫోన్‌తోనే సమయం గడుపుతున్నారా..? అయితే అప్రమత్తం కండి.