ఆన్ లైన్ రుణాల ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్న బాధితులు ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. రుణ సంస్థల వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా.. తమకూ అలాంటి పరిస్థితి వస్తుందనే భయంతో ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారికి అక్కడా చేదు అనుభవమే ఎదురవుతోంది.
క్షణాల్లో రుణం ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనను చూసి.. అందరిల్లానే సమస్యల్లో ఇరుకొన్నాడు కొంపల్లికి చెందిన శ్రీకాంత్. ఫేస్ బుక్ లో వచ్చిన గో – క్యాష్ అనే యాప్ లో వ్యక్తిగత రుణ ప్రకటన చూసి వారికి తన వివరాలు పంపించాడు. అతని వివరాలన్నీ తీసుకుని రూ. 50 వేల మంజూరు చేసింది ఆ సంస్థ. అయితే ముందుగానే 15 వేల రూపాయలను మినహాయించుకొని రూ. 35 వేలు శ్రీకాంత్ అకౌంట్ లో నగదు జమ చేసింది. డబ్బులు తిరిగి చెల్లించేందుకు వారం మాత్రమే గడువును ఇచ్చింది.
గడువు ముగియడంతో.. యాప్ నిర్వహణ సిబ్బంది శ్రీకాంత్ కు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసారు. దీంతో శ్రీకాంత్ మరికొంత గడువు కావాలని అడిగాడు. వారు అతని విజ్ఞప్తిని పట్టించుకుపోగా.. దుర్భాషలాడారు. నగదు కట్టక పోతే కేసులు పెడతామని.. బంధు,మిత్రులకు ఫ్రాడ్ అని సమాచారం ఇస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. వారు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయాలంటూ పంపారు. తీరా అక్కడికి వెళ్తే.. సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో బాధితుడు మీడియాను ఆశ్రయించాడు.