ఆన్‌లైన్‌లో రుణాలపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అనుమతి లేని యాప్స్‌లలో అప్పులు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించలేక తిప్పలు పడుతున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్టు తేలింది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఊబిలో లక్షలాది మంది చిక్కుకున్నారని తెలిసింది. తెలంగాణ పోలీసులు దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 1.5లక్షల మంది ఇప్పటివరకు వివిధ ఆన్‌లైన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. ఇందులో దాదాపు 70వేల మంది వాటిని చెల్లించలేక బాధితులుగా మారరని వారు చెప్తున్నారు. 35 శాతం అధిక వడ్డీ విధిస్తూ.. ఫేక్ లీగల్ నోటీసులతో వినియోగదారులను వేధిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
ఆన్‌లైన్ రుణాలు మంజూరు చేస్తున్న యాప్స్‌కు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతి లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రుణాలపై వేధింపులు ఎక్కువైతే పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో డబ్బు ఇచ్చే సంస్థలన్నీ మోసపూరితమైనవనే విషయాన్ని గ్రహించి.. జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.