లోన్ యాప్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ యాప్ ల కారణంగా నిత్యం ప్రాణాలు పోతున్నా.. వేధింపులకు మాత్రం చెక్ పడటం లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట వీరి బారిన పడి మోసపోతూ మానసిక వేదనకు గురవుతున్నారు. అమాయక జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ లోన్ యాప్ ఆగడాలకు ఆత్మహత్య చేసుకొనే వారి సంఖ్యా రోజు రోజుకు పెరిగిపోతుంది. తియ్యగా లోన్ ఇస్తామని చెప్పి.. కాంటాక్ట్స్, వ్యక్తిగత డేటా తస్కరించి.. బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఘటనలు తరచు చూస్తున్నాం. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో యువకుడు లోన్ యాప్ ఉచ్చులో పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు తన అవసరం కోసం ప్లే స్టోర్ లో లోన్ యాప్ కోసం వెతికాడు. రేటింగ్ బాగుంది కదా అని వండర్ లోన్ అనే అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. అందులో ఆధార్, పాన్ కార్డ్, తన సెల్ఫీ తో పాటు పూర్తి వివరాలు అప్ లోడ్ చేశాడు.
అయితే ఆ యాప్ లో వడ్డీ ఎక్కువగా చూపించింది. దీంతో వద్దనుకున్న యువకుడు అప్లికేషన్ ఓకే చేయకుండా రిమూవ్ చేశాడు. కట్ చేస్తే యువకుడి అకౌంట్లో 9 వేలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే షాక్ అయిన యువకుడు మళ్ళీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడగా లోన్ అప్రూవ్ అయినట్టుగా ఉంది. డబ్బులు జమ అయిన వారం రోజుల తర్వాత లోన్ కట్టాలంటూ వాట్సాప్ కాల్స్, మెసేజేస్ రావడం మొదలయ్యాయి.
దీంతో శ్రీనివాస్ 9 వేల రూపాయలు కట్టేశాడు. అయినా మెసేజ్ లు రావడం ఆగలేదు. ఇంకా డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి మొదలైంది. బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ లు కూడా పంపుతుండడంతో సైబర్ క్రైం పోలీసులను శ్రీనివాస్ ఆశ్రయించాడు. అంతటితో ఆగని దుండగులు తన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని… న్యూడ్ ఫోటోలను ఫోన్ కాంటాక్ట్ నెంబర్లకు పంపుతామని బెదిరింపులకు గురి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.