– లోన్ ఇస్తామని పదేపదే ఫోన్లు
– వద్దన్నా ఒక్కోసారి అకౌంట్లలో జమ
– వారంలో చెల్లించాలంటూ ఒత్తిడి!
– లేకపోతే బెదిరింపులు
– అప్పటికీ ఇవ్వకపోతే.. స్నేహితులు, బంధువులే టార్గెట్
– వాట్సాప్ చాటింగ్ తో నగ్న ఫోటోలు
– స్క్రీన్ షాట్ తీసి వేధింపులు
– మీ వాడి లోన్ మీరు కట్టాలంటూ బెదిరింపులు
– నగరంలో పెరిగిపోతున్న లోన్ యాప్ కేసులు
ఈరోజుల్లో మధ్య తరగతి వాడు జీతంతో కుటుంబం నడవాలంటే అద్భుతమే. అందుకే కొందరు అప్పులు చేస్తూ తిప్పలు పడుతుంటారు. అలాంటి వారికే ఆన్ లైన్ అప్పుల యాప్ లు ఎర వేస్తుంటాయి. ఒక్కసారి చిక్కితే అంతే సంగతులు. తీసుకునే దాకా ఫోన్లతో ఒక తంటా.. తీరా తీసుకున్నాక మరో తంటా. ఏజెంట్ల వేధింపులు, చట్టవిరుద్ధమైన విధానాలు, క్రూరమైన దురాగతాలతో నానా ఇబ్బందులు పడాల్సిందే. భాగ్యనగరంలో ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అనేకమంది అమాయకులు ఆత్మహత్యలకు దారితీస్తోంది.
కరోనా మహమ్మారి అన్ని రంగాలలోని ప్రజల జీవితాలను నాశనం చేసింది. చాలా మంది ఆర్థికంగా విచ్ఛిన్నమయ్యారు. పైగా క్షీణిస్తున్న ఆర్థికవృద్ధి, ఉద్యోగుల తొలగింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశంలో కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కొరత కోట్లాది మంది భారతీయులను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ కష్టకాలంలో సామాన్యులను ఆదుకోవాల్సిన సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ కష్ట సమయాల్లో ప్రజలు రుణాల కోసం ఓకే రూపీ లాంటి ఆన్ లైన్ లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు.
ఈ యాప్ లు అధిక వడ్డీ రేట్లకు లోన్ లు, ప్రాసెసింగ్ ఫీజు, ఆలస్య రుసుం, ఇతర సాకులతో విపరీతమైన మొత్తాలను వసూలు చేస్తున్నప్పటికీ, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ మొండిచేయి చూపడంతో ప్రజలు వీటిని సంప్రదించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. భాదాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ డిఫాల్ట్ చేసే పలుకుబడి ఉన్న వ్యక్తులకు వేల కోట్ల రుణాలను అందజేస్తున్నాయి కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సమయాల్లో చిన్న మొత్తాలను కూడా అందించడం లేదని అంటున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల్లో కేవలం 900కు పైబడిన పలుకుబడి వున్న వ్యక్తులు సుమారు రూ.1.30 లక్షల కోట్ల రుణ మొత్తాలను ఎగవేసినట్లు ఇండిపెండెంట్ సిటిజన్ గ్రూప్ చేసిన అధ్యయనంలో తేలింది. కానీ.. దురదృష్టవశాత్తూ, బ్యాంకులు వివిధ నియమాలు, నిబంధనలను చెబుతూ రూ.10వేల రుణం కోసం సామాన్యులకు మొండిచేయి చూపిస్తున్నాయి. సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఈ ఆన్ లైన్ లోన్ యాప్‌లు లక్షలాది మంది అమాయకులు, కష్టజీవులని కొల్లగొడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యాప్ లు 30 శాతం నుండి ఊహకందని 200 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నాయి. వివిధ కారణాలను చూపుతూ అనేక సందర్భాల్లో రెండింతలు, మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఈ యాప్ లు చాలా వరకు చట్టవిరుద్ధమైనవి, ఎలాంటి రిజిస్ట్రేషన్ ను లేకుండా, అనైతిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలని దోచుకుంటున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఒక వ్యక్తి రుణం చెల్లించలేని పక్షంలో రికవరీ కోసం దారుణంగా బలవంతం చేస్తూ హేయమైన పద్దతులు అనుసరిస్తున్నాయి.
ఓకే రూపీ లాంటి ఆన్ లైన్ లోన్ యాప్ ల రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి ఫిన్ టెక్ కంపెనీలుగా కాకుండా మాఫియా సంస్థలుగా పనిచేస్తున్నాయి. రుణాలు పొందిన మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. రుణగ్రహీతలను అవమానపరిచేలా వారి పరిచయస్తులకు ఫోటోలు, వివరాలను షేర్ చేసి చిత్రహింసలు పెడుతున్నాయి. రికవరీ ఏజెంట్లుగా ఎక్కువగా రౌడీషీటర్లే ఉంటున్నారు. రుణగ్రహీతల ఇళ్ళపై ఆ గూండాలు దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ఆపరేటర్ లు చేసిన అవమానాన్ని తట్టుకోలేక చిన్నపాటి పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం, ఇతరులతో సహా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
వారం రోజుల క్రితం కూడా ఈఎంఐ చెల్లించని ఓ హైదరాబాద్ మహిళ చిత్రాలను నగ్న ఫోటోలుగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత సంవత్సరం కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనైతికమైన ఆన్ లైన్ లోన్ యాప్ లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అనేక దారుణమైన సంఘటనలు, బాధితుల నుండి ఫిర్యాదుల తర్వాత కూడా ఈ యాప్ లపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఆర్థిక మోసగాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినట్లే అవుతుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్న ఘోరాలను వివరించారు. తాము చేసిన పరిశోధన, విచారణలో 90 శాతానికి పైగా ఆన్ లైన్ లోన్ యాప్ లు ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్, ఏ బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ మద్దతు లేకుండా ఉన్నాయనే షాకింగ్ వాస్తవం వెల్లడైయిందని అన్నారు. అనేక మంది బాధితుల నుండి సహాయం కోసం కాల్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, ముంబై, నోయిడా, గుర్‌గ్రామ్, పాట్నా, జమర్తాతో పాటు నేపాల్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ అక్రమ ఆన్ లైన్ లోన్ యాప్ లు ఎక్కడ నుండి పని చేస్తున్నాయో గమనించామని తెలిపారు. కాబట్టి, చట్టవిరుద్ధమైన, అనైతికమైన, నేరపూరితమైన ఆన్ లైన్ లోన్ యాప్ ల నుండి లక్షలాది మంది అమాయకులు, కష్టజీవులని రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను కోరారు శ్రవణ్.