ఇటీవల బాలీవుడ్‌లో చాలా మంది బ్యాచిలర్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. గతేడాది విక్కీ కౌశల్- కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, మౌనీరాయ్-సూరజ్ నంబియార్ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ వివాహం.. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, అలియాభట్, రణబీర్ వివాహం ఏప్రిల్ 14న ముంబైలో జరగనున్నట్లు అలియాభట్ సోదరుడు రాహుల్ భట్ వెల్లడించారు.
అయితే, కరణ్ జొహార్, షారూక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, ఆకాంక్ష రాజన్, అనుష్క రాజన్, రోహిత్ ధావన్, వరుణ్ ధావన్, జోయా అక్తర్ తదితర ముఖ్యమైన బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానం ఉంటుందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. అలియాభట్, రణబీర్ వివాహం కేవలం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుందట. పెళ్లికి కేవలం 28 మంది అతిథులు హాజరు కానున్నట్టు రాహుల్ భట్ తెలిపారు. వీరంతా కూడా అధిక శాతం కుటుంబ సభ్యులేనని, బస్సులో చెంబూర్‌కు వస్తారని చెప్పారు.
ముంబై, చెంబూర్‌లో రణబీర్ కపూర్ నివాసంలో వివాహం జరగనున్నట్టు రాహుల్ ప్రకటన పరిశీలిస్తే తెలుస్తోంది. అంతే కాదు, రాహుల్ భట్ ప్రకటన ప్రకారం బయటి వారు ఎవరికీ ఆహ్వానం ఉండదని తెలుస్తోంది. వివాహ వేదిక విషయంలో రణబీర్ కపూర్‌కు చెందిన బంద్రాలోని నివాసం పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా అలియాభట్, రణబీర్ కపూర్ వైపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, ఈ జోడీ 2020 డిసెంబర్‌లోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో వీరి పెళ్లి వాయిదా పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం రణబీర్, అలియాభట్ వరుస సినిమాలతో కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తయ్యాకే పెళ్లిపీటలెక్కాలని భావించారు. అయితే అలియాభట్ తాత ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో.. సాధ్యమైనంత త్వరగా వివాహ ఘట్టాన్ని పూర్తిచేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట. ఆ కారణంగానే ఈ నెల మూడోవారంలోనే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది.