స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకున్నోడు వచ్చి మంచి పోటు మీదున్న కాలువలో ఈత కొడదామని చూస్తే ఏమవుతుంది? వాటర్ ఫోర్సుకు ఎటు పడితే అటు కొట్టుకుపోతాడు. కంగారుపడితే.. మునిగిపోతాడు కూడా. నాకు ఈత వచ్చు.. అవతలి ఒడ్డుకు వెళ్లాలంతే అని దబాయిస్తే ఎలా.. ఆ కాలువలో నీళ్లు ఎలా ఉన్నాయో.. మధ్యలో రాళ్లు ఉన్నాయా.. ఇసుక మేటలున్నాయా.. వాటర్ తోసేస్తే ఎలా ఆపుకోవాలి.. లాంటి టెక్నిక్స్ అనుభవం ఉన్నవాళ్లు చెబుతారు.. అవి విని ఫాలో అయిపోతే.. అవతలి ఒడ్డుకు వెళ్లొచ్చు. కాని అవేమి విననంటే ఏమవుతుందో.. ఏపీలో పాలన చూస్తుంటే అర్ధమవుతుందనే కామెంట్లు వినపడుతున్నాయి.
ఏ పాలసీ అయినా సరే. ఉద్దేశం ఏదైనా కావొచ్చు. సరైన ప్రిపరేషన్ లేకుండా.. అధికారులు, ఇతర సీనియర్ నేతల సలహాలు తీసుకోకుండా.. టకటకా జీవోలు ఇవ్వడం.. ఆ తర్వాత అందరూ విమర్శలతో మీద పడటం.. తర్వాత చర్చ జరపటం..అప్పుడు అధికారులు నోరు విప్పి సమస్యలు చెప్పడం.. ఆ తర్వాత మళ్లీ మార్పులు చేయడం.. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా కామన్ అయిపోయాయని చెప్పుకుంటున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో అదే జరిగింది. మనం రేటు ఎక్కువ పెట్టేస్తున్నాం.. ఇంత ఎక్కువ ఇవ్వడానికి కారణం చంద్రబాబే.. వాళ్లు లాభం పొంది.. రాష్ట్రానికి నష్టం చేస్తున్నారంటూ.. ఏకాఏకిన సోలార్, విండ్ పవర్ కంపెనీల నుంచి కరెంట్ తీసుకోవడం ఆపేశారు. రేట్లు మార్చుకుందాం.. మాట్లాడుకుందాం రమ్మని లెటర్లు పంపారు. కాని అవి ఏ పాలసీ ప్రకారం జరిగాయి. ఇండియా మొత్తం ఉన్న పాలసీయా.. ఏపీలోనే ఫాలో అయిన పాలసీయా.. ఆ కంపెనీలు ఏపీ వాళ్లవేనా.. బయటి దేశాలవి కూడా ఉన్నాయా.. ఈ ప్రభావం ఎంత వరకు పడుతుంది.. ఏం జరుగుతుంది లాంటి ఆలోచనలే చేయలేదు. అవి చెప్పాలని చూసిన అధికారుల నోరు మూయించారు తప్ప.. అస్సలు వినలేదు. ఇక్కడ రేట్లు తగ్గించి.. రాష్ట్రానికి ఆర్ధికంగా మేలు చేయాలనుకోవడంలో తప్పు లేదు. కాని అలా చేయాలంటే ఎలా ప్రొసీడ్ కావాలి.. సాధ్యాసాధ్యాలేంటివన్నీ ముందే ప్రిపేర్ అయి… స్కెచ్ వేసుకుని.. వాళ్లని తప్పించి.. కొత్తవాళ్లను కొత్త రేట్లతో అగ్రిమెంట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు వారంతా చంద్రబాబు బంధువులే అన్నట్లు కక్షపూరితంగా వ్యవహారం చేస్తే.. అది బెడిసికొట్టింది.
కేంద్రం, ఆఖరుకు జపాన్ దేశం సైతం రియాక్టయింది. ఇదేం పద్ధతి అంటూ పెట్టుబడిదారులంతా విస్తుపోవడమే కాదు.. విమర్శలు కూడా కురిపించారు. సరే ముందు వెనకా ఆలోచించకుండా.. సప్లయ్ తీసుకోవడం ఆపేశారు. మనం పవర్ ఎంత తీసుకుంటున్నాం.. అందులో వీటి వాటా ఎంత? బొగ్గు ద్వారా వచ్చే థర్మల్ ప్లాంట్ విద్యుత్ ఎంత? నీటి ద్వారా వచ్చే హైడల్ పవర్ వాటా ఎంత? అని లెక్కలేసుకున్నారా.. అంటే అదీ లేదు. సడెన్ గా కరెంట్ సరిపోవడం లేదంటూ అనధికార కోతలు మొదలెట్టి.. ఆ తర్వాత తీరిగ్గా లెక్కలేసుకున్నారు. బొగ్గు సరిపోవడం లేదంటూ కేంద్రానికి ఇప్పుడు లేఖలు రాస్తున్నారు. అదీ పరిస్ధితి.
ఇసుక సంగతి సరేసరి. ఆన్ లైన్ విధానం ఎలా పెట్టాలి? ఇసుక అమ్మితే వచ్చే ఆదాయం ఎంత? స్టాక్ పాయింట్లు కొత్తవి మెయిన్టెయిన్ చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? ఇవేమీ ముందు అనుకోలేదు. ఇసుక సప్లయ్ ఆపేయండి. కొత్త సిస్టమ్ పెట్టండి.. అదే ఆర్డర్. అదెలా చేయాలో.. ఏం చేయాలో డైరెక్షన్ లేదు. ఫలితం ఏంటో ఇప్పుడు అందరూ చూస్తున్నారు.
ఇంగ్లీషు మీడియం సంగతి కూడా అంతే. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు.. ఒక్కసారే మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టేయమని ఆర్డరిచ్చేశారు. అది సినిమా కాబట్టి.. అన్ని చర్చలు చూపించలేరు.. నిర్ణయాలు మాత్రమే సినిమాటిక్ గా చూపిస్తారు. కాని ఇది వాస్తవం. ఇంగ్లీష్ మీడియం పెట్టి.. తెలుగు మీడియం తీసేయాలా.. రెండు కంటిన్యూ చేయాలా అనేది ఆలోచించాలి కదా.. దాని మీద అధికారులు చెప్పే సలహాలు కూడా వినాలి. అసలు స్కూళ్లు వసతులు బాగోలేదు.. టీచర్ల స్టాండర్డ్స్ సరిపోవటం లేదు వారే రివ్యూ చేసి.. ఇలాంటి నిర్ణయం చేస్తే ఏమనాలి. ఇప్పుడు అందరూ తిట్టాక.. ఆరవతరగతి వరకు మొదట చేసి.. తర్వాత విస్తరిద్దాం అంటున్నారు. ఇదేదో ముందే చేయొచ్చు కదా.. అని అనుకోవచ్చు.. ముందు చర్చ జరిగి.. ఎదుటివారు చెప్పేది వింటే కదా.
మన కోరికలు చెప్పి.. అమలు చేయమనటమే కాదు.. లీడర్ అంటే. అది ఎలా చేయాలో చెప్పాలి.. ఎలా అమలవుతుందో పర్యవేక్షించాలని పెద్దలంటున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ ఏంటో కూడా చెప్పడానికి అధికారులు సిద్ధంగానే ఉన్నారు. కాని వినేవారు లేరని అధికారులే వాపోతున్నట్లు తెలుస్తోంది.