భారత్- నేపాల్ మధ్య ఉన్న బహిరంగ సరిహద్దులను దుర్వినియోగం చేయవద్దని ప్రధాని మోడీ అన్నారు. మోడీతో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా శనివారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన … ఇండియా, నేపాల్ మధ్య బహిరంగ సరిహద్దుల గురించి చర్చలు జరిపినట్టు తెలిపారు. వాటిని ఉగ్రవాదులు చేతిలో దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. రక్షణ, భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని ఇరు దేశాలు కొనసాగించాలని నొక్కి చెప్పినట్టు తెలిపారు.
ఇండియా, నేపాల్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలు విభిన్నమైనవని మోడీ అన్నారు. అలాంటి స్నేహం ప్రపంచంలో మరెక్కడా కనిపిందన్నారు. విద్యుత్ సహకారంపై తమ ఉమ్మడి దార్శనిక ప్రకటన భవిష్యత్ సహకారానికి బ్లూప్రింట్‌గా ఉంటుందన్నారు.
గత ఏడాది జులైలో ఐదవసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి దేవుబా విదేశాల్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య శనివారం నాలుగు ఒప్పందాలు కుదిరాయి. రైల్వేలు, శక్తి రంగాల్లో సంబంధాలను మరింత విస్తృత పరిచేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.