పుష్ప సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు సీక్వెల్ పనిలో పడ్డాడు. పుష్ప-2 స్క్రిప్టింగ్ మొదలుపెట్టాడు. ఏప్రిల్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు సుక్కూ. అయితే పుష్ప పార్ట్-2 ఎండింగ్ విషయంలో సుకుమార్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
టైటిల్ లో చెప్పినట్లుగా, రెండో భాగంలో శేషాచలం అడవుల డాన్‌గా పుష్ప కనిపించబోతున్నాడు. అతడి హవా, ఐపీఎస్ ఆఫీసర్ ఫహాద్ ఫాజిల్ తో అతడి పోరాటాన్ని పుష్ప-2లో పూర్తిస్థాయిలో చూపించబోతున్నారు. ఈ భాగంతో కథ ముగించాలి. అయితే దీన్ని హ్యాపీ నోట్‌తో ముగించాలా లేక విషాదంతో ముగించాలా అనే అయోమయంలో సుకుమార్ ఉన్నాడట. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ముగించాలనేది అతని అసలు ఆలోచన.
ఓపెన్-ఎండింగ్ క్లైమాక్స్ అంటే నిర్ణయం ప్రేక్షకులదే అని అర్థం. ఇందులో సుఖాంతం, దుఃఖాంతం అంటూ ఏమీ ఉండదు. చివరి వరకు సినిమాను తీసుకెళ్లి ఓ దశలో ఠపీమని శుభం కార్డు వేసేస్తారన్నమాట. ఇక అక్కడ్నుంచి ప్రేక్షకుడు ఊహించుకోవడమే. దీన్ని ఓపెన్-ఎండ్ అంటారు.
దాదాపు ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కూడా ఇలానే ఉంటుంది. ఆ క్లైమాక్స్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నాడు సుక్కూ. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఓపెన్ ఎండ్ తో పుష్ప-2ను ముగించాలని అనుకుంటున్నాడు. దీనికి సంబంధించి బన్నీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.