బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య… ఇండిగో విమానం అత్యవసర డోర్ ని పొరబాటున తెరిచారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పైగా తాను చేసిన పనికి క్షమాపణ కూడా చెప్పారని, ఇక వివాదం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. గత డిసెంబరు 10 న చెన్నై నుంచి తిరుఛ్చిరాపల్లి వెళ్లనున్న ఈ విమానం అత్యవసర డోర్ ని కర్ణాటకకు చెందిన ఈ ఎంపీ తెరవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది.
అయితే ఆనాడు ఆ ‘ప్యాసింజర్’ ఎవరో ఈ ఎయిర్ లైన్స్ గుర్తించలేకపోయిందని . కావాలనే ఈ ‘ప్యాసింజర్’ విషయాన్ని ఈ ఎయిర్ లైన్స్ రహస్యంగా ఉంచిందని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది.ఇది ‘ప్రాంక్’ అనుకుంటే ఎవరిని నిందించాలి అని ప్రధాని మోడీని ఉద్దేశించి ఈ పార్టీ నేతలు అన్నారు.
అసలు ఇదేమైనా పిల్ల చేష్టలా అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ప్రశ్నించారు. ఒకవేళ ఈ విమానం అప్పటికే కదిలిపోయి ఉంటే ఏం జరిగి ఉండేదన్నారు. తేజస్వి సూర్య కంటి తుడుపుగా అపాలజీ చెబితే సరిపోతుందా అని కూడా వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఇంతగా వివాదం కావడంతో స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా.. ఏదో పొరబాటున అలా జరిగిందని బుధవారం ప్రకటించారు.
ఇక ఇక్కడితో ఈ వివాదాన్నివదిలివేయాలన్నారు. ఇండిగో యాజమాన్యం కూడా ఓ స్టేట్మెంట్ విడుదల చేస్తూ.. నాడు జరిగిన ఘటనపై తాము సమీక్షించామని, భద్రతలో ఎలాంటి లోపమూ జరగలేదని పేర్కొంది. ఆ ‘ప్యాసింజర్’ పొరబాటున అలా చేశారని డీజీసీఎ అధికారి ఒకరు చెప్పారు.