ఆపరేషన్ మదర్ పేరుతో.. చేపట్టిన కార్యక్రమం మూడో రోజు ఉధృతంగా సాగింది. నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అర్థరాత్రి.. పెద్ద పులిలో కోసం వేట సాగింది. అలా ఇలా కాదు.. 70 డ్రోన్ కెమెరాలతో.. 300 మంది సిబ్బంది జల్లెడ పట్టారు. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చే క్రమంలో.. అటవీ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
నాలుగు పులి కూనలను.. ప్రత్యేక వాహనం అడవిలోకి తీసుకెళ్లారు అధికారులు. తప్పిపోయిన తల్లి పులిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను సైతం ఉపయోగించుకుంటున్నారు అటవీ అధికారులు. కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ శివార్లలోని అచ్చిరెడ్డి కుంట సమీపంలో పెద్ద పులి అడుగులు గుర్తించారు అధికారులు. అది తల్లి పులిగా భావించిన అధికారులు.. అర్థరాత్రి సమయంలో అటవీ సిబ్బందితో.. పులి కూనలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అడుగులు గుర్తించిన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో పులి కూనల శబ్ధాలను కృత్రిమంగా మోగించారు.. పులి కూనల శబ్దాలకు తల్లి పులి వస్తుందేమో అని రాత్రంతా అడవిలోనే కాపు కాశారు.
తల్లి పులి వస్తే.. పిల్లలను బయటకు వదిలే విధంగా వ్యూహం రచించారు. మనుషుల వాసనలు రాకుండా.. పులి కూనల మూత్రాన్ని ఆ ప్రాంతం అంతా చల్లారు.. వాసన పసిగట్టి అటు వస్తుందోమో అని వెయిట్ చేశారు. అదే విధంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో 70 డ్రోన్ కెమెరాలు, 300 మంది సిబ్బంది రాత్రంతా కాపు కాసినా ఫలితం లేకపోయింది. దీంతో ఉదయం ఆరు గంటలకు తిరిగి కార్యాలయానికి చేరుకున్నారు.
తల్లి పులి దగ్గరకు పులి కూనలను చేర్చే వరకు ఆపరేషన్ మదర్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. తల్లి లేకపోవటంతో కూనలు సరిగా ఆహారం తీసుకోవటం లేదంటున్నారు పాలు మాత్రమే తాగుతున్నాయని.. డాక్టర్ల సూచనలతో కోడి లివర్ ఇస్తున్నామని.. కొంచెం కొంచెం తింటున్నాయని చెబుతున్నారు అధికారులు. మరో రెండు, మూడు రోజులు ఆపరేషన్ మదర్ కంటిన్యూ చేస్తామని వెల్లడించారు అధికారులు.