కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. లెక్కల గారిడీ తప్ప.. ఇది సామాన్యులకి ఏమాత్రం ఉపయోగం లేదని బీజేపీయేతర నాయకులు విమర్శిస్తున్నారు.
ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది శూన్య బడ్జెట్ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. వేతన జీవులు, మధ్య తరగతి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని అన్నారు.
ఇది పెగాసస్ స్పిన్ బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల అణగారిపోతున్నవారికి దీనివల్ల ఉపశమనం కలగదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మమత సామాన్యులకు సున్నాలు కేటాయించారని ఆరోపించారు.
ప్రధాన సమస్యలకు ఆ బడ్జెట్ లో పరిస్కారం చూపించలేదని బీఎస్పీ అధినేత మాయావతి విమర్శించారు. దేశంలో నానాటికీ పెరుగుతోన్న పేదరికం, నిరుద్యగం, రైతు ఆత్మహత్యలు వంటి సమస్యలను గాలికొదిలేశారని అన్నారు. పెద్ద ఎత్తున ప్రకటనలు చేయడం తప్పితే అమలు గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచించడమే లేదని మాయావతి అన్నారు.
ఈ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసేలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ దశ, దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేనిదనిదిలా ఉందది ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడుకుందని ఆరోపించారు.