– ప్రోటోకాల్ ఎదుటివారికే..
– ఆయనకు మాత్రం వర్తించదు!
– అవతలి వ్యక్తి తనని గౌరవించాలి..
– ఆయన మాత్రం ఆచరించరు!
– అందరిదీ అంబేద్కర్ రాజ్యాంగం
– సారుది మాత్రం సపరేట్ సంస్థానం!
– నిజాంను గుర్తు చేస్తూ నిర్ణయాలు
– తనను మించినవారు లేరంటూ ప్రగల్భాలు
– కేసీఆర్ తీరుపై ప్రతిపక్షాల విసుర్లు
రాజుల కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో మన తాతలు, ముత్తాతలు చెబుతుంటే విన్నాం. కొందరు రాజులు చేసిన అకృత్యాలు విని అప్పటి ప్రజలను తలచుకుని అయ్యో పాపమని అనుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై నిజాం రాజులు సాగించిన దారుణ పాలనను కథలు కథలుగా విన్నాం. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిజాం నవాబును గుర్తు చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘‘నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి.. నా మాటే శాసనం’’ అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటోందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. దీనికి అనేక సంఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరు నోరు విప్పినా అంతే.. అక్రమ కేసులు స్వాగతం చెబుతాయని అంటున్నారు విపక్ష నేతలు. సామాన్యులు గానీ, జర్నలిస్టులు గానీ, ప్రతిపక్ష నేతలు గానీ.. ఇలా ఎవరినీ వదలకుండా నయా నిజాం పాలన సాగిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయం అటుంచితే.. రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా తన సొంత ప్రోటోకాల్ పాటిస్తున్నారని అంటున్నారు. ఇందులో మాత్రం కచ్చితంగా రాజును తలపిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజుల కాలంలో మహారాజు ఏది చెబితే అదే రాజ్యాంగం. అచ్చం దాన్నే ఫాలో అవుతూ ప్రోటోకాల్ విషయాన్నే పక్కకు పడేసి తాను ఏది అనుకుంటే అది జరగాలనే ధోరణితో కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వివరిస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటనలనే చూడండి.. సాధారణంగా ఏ రాష్ట్రం నుంచి అయినా ప్రభుత్వం తరఫున ఎవరైనా ఢిల్లీకి వెళ్తే.. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం దాన్ని పాటించరని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లడం.. అక్కడకు వెళ్లాక అపాయింట్ మెంట్ అడగడం.. దొరకకపోవడంతో దాన్ని రాజకీయంగా వాడుకోవడం.. ఇదీ.. కేసీఆర్ తన రాజ్యాంగం ప్రకారం కొన్నాళ్లుగా అనుసరిస్తున్న విధానమని మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు.. అసెంబ్లీకి ముందు ఆమె ప్రసంగాన్ని సైతం తీసేయించారని గుర్తు చేస్తున్నారు. తమిళిసై రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. గులాబీ నేతలు, అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా కేసీఆర్ చేశారని అంటున్నారు. దీన్నిబట్టే ఆయన ముమ్మాటికి తనను తాను రాజుగా ఊహించుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.
తాజాగా ప్రధాని మోడీ ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే.. ఈ విషయం ప్రభుత్వ వర్గాలకు ముందుగానే తెలుస్తుంది. అయినా కూడా ఇక్కడ ఉంటే ఎక్కడ స్వాగతం పలకాల్సి వస్తుందేమోనని అప్పటికప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. మోడీ టూర్ అయిపోయే దాకా ఇతర రాష్ట్రాల పర్యటనలు పెట్టుకున్నారని వివరిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా.. తనను మాత్రం గౌరవించడం లేదని కేసీఆర్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు బీజేపీ నేతలు. నేను చెప్పేదే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
నిజానికి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని కేసీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఓ పథకం ప్రకారం రాజు మాదిరిగా అన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతీసారి ఏదో ఒక విషయంలో ఆయన చేష్టలే దీన్ని బయటపెడుతున్నాయిని వివరిస్తున్నాయి.