- ఎవరి సొమ్ము.. ఎవరికి సారూ!
- కల్లాల్లో తెలంగాణ రైతన్న కన్నీళ్లు
- వడ్లు కొంటారని దీనంగా ఎదురుచూపులు
- సగం నెల గడిచేదాకా ఉద్యోగులకు నో శాలరీ
- జీతమో చంద్రశేఖరా అంటున్న పెన్షనర్లు
- అప్పు పుడితేనే సంక్షేమం బండి ముందుకు..
- ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే..
- ఎక్కడో పంజాబ్ రైతులకు చెక్కుల పంపిణీనా?
- వారిని అక్కడి ప్రభుత్వాలు, కేంద్రం ఆదుకోవా?
- ఇక్కడి సొమ్ము అక్కడ పంచడం వెనుక ఉద్దేశం ఏంటి?
- అంతగా ఇవ్వాలనుకుంటే..
- కల్వకుంట్ల కుటుంబం జీతం నుంచి ఇవ్వొచ్చుగా?
- కేసీఆర్ కు ప్రతిపక్షాల ప్రశ్నలు
కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక రాజకీయ స్వార్థం ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించే మాటే. ఉద్యమ పార్టీని పూర్తి రాజకీయ పార్టీగా మార్చేసి.. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా నిజాం రాజులా పరిపాలన సాగిద్దామని అనేక ప్రయత్నాలు చేశారని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్.. అక్కడ కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నారని అంటున్నాయి. కేవలం ఆయన స్వలాభం కోసం తన లాంటి దేశ్ కీ నేత లేరనే ప్రచారం చేసుకోవడం కోసం.. కేసీఆర్ చేస్తున్న పనులు చూస్తుంటే తమకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఒళ్లు మండుతోందని చెబుతున్నాయి ప్రతిపక్షాలు.
ఓవైపు రాష్ట్రంలో రైతన్న ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూస్తున్నాం. ధాన్యం కొంటారేమోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పరిస్థితి. కేంద్రం వల్ల కావడం లేదు.. మేమే మొత్తం కొంటామని ప్రగల్భాలు పలికి.. తీరా అరకొరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని కేసీఆర్ పై విమర్శలు ఉన్నాయి. తక్కువగా కొనుగోలు కేంద్రాలు తెరవడం ద్వారా అటు వర్షానికి నష్టపోతూ.. ఇటు తక్కువ ధరకే అమ్ముతూ.. ఇబ్బందులు పడుతున్నాడు అన్నదాత. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి.. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే కుర్చీ వేసుకుని కూర్చొని వడ్లు కొనాలి కదా..? మరి.. అది జరుగుతుందా? అంటే లేదని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో రైతులు ఈ విధంగా అవస్థలు పడుతుంటే.. ఇతర రాష్ట్రాల్లో రైతుల్ని ఉద్దరించడానికి బయలుదేరి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటు చూస్తే.. 13 దాటినా ఉద్యోగులకు జీతాలు పడడం లేదు.. అప్పులు తెచ్చుకుని వారంతా బతుకు బండిని నడిపిస్తున్నారు. జీతం రావడం… అప్పులు తీర్చుకోవడం.. ఇదే వారి లైఫ్ లో రొటీన్ గా మారిపోయింది. ఇక ప్రభుత్వానికి అప్పులు పుట్టనివ్వడం లేదని కేంద్రంపై నిన్నగాక మొన్న ఎలాంటి రాద్ధాంతం చేశారో చూశాం. సంక్షేమానికి ఇబ్బందులు తీసుకు రావొద్దని ప్రభుత్వ వర్గాలు చెప్పిన మాటల్ని విన్నాం. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని అక్కడెక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని ఆదుకుంటానని కేసీఆర్ అక్కడకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు జరిగాయి. చనిపోయిన రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం నష్ట పరిహారం ఇవ్వడంలో తప్పులేదు. మరి.. తెలంగాణలో రైతుల ఉసురు పోసుకుంటూ ఇక్కడి సొమ్మును పంజాబ్ రైతులకు ఇవ్వడం పద్దతి కాదని చెబుతున్నాయి విపక్ష పార్టీలు. ఇదంతా జాతీయ రాజకీయాల్లో తనను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం పీకే వేసిన ప్లాన్ లో భాగంగా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని అర్థం అవుతోందని అంటున్నాయి. అంతగా డబ్బులు ఇవ్వాలని ఆశగా ఉంటే.. నెల నెలా రూ.25 లక్షల జీతం తీసుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం తమ సొంత డబ్బులు ఇవ్వొచ్చుగా.. ఇక్కడి ప్రజలు కష్టపడి సంపాదించి.. పన్నులు కట్టిన డబ్బును అక్కడెక్కడో ఖర్చు చేయడం ఏంటని నిలదీస్తున్నాయి.